సమాధి పరిస్థితి


సమాధి పరిస్థితి 

మనోహరమైన, సుఖ సౌఖ్యాలతో కూడుకున్న ఈ మూనాళ్ళ  జీవితపు ముచ్చట తీరిన తర్వాత రాబోయే దశలు అత్యంత కఠినంగా, బాధాకరంగా, వ్యధాభరితంగా ఉంటాయి. అన్నిటికంటే మొదటి దశ చావు. ప్రాణమున్న ప్రతి జీవి చావు గుటక వేయవలసిందే. ప్రాణమున్న ప్రతి జీవి మృత్యువును చవి చూడవలసిందే అని అల్లాహ్ సెలవిస్తున్నాడు.
(كل نفسين زآييقتول موت (قران؛ 3:185

"ప్రతి జీవి మృత్యువును చవి చూడవలసిందే. (ఖుర్'ఆన్; 3:185)

మరణించిన తర్వాత ఎవరూ తిరిగి రారు. కనుక మృత్యువు సంభవించేటప్పటి పరిస్థితి ఎలా ఉంటుందో ఖచ్చితంగా చెప్పలేము. కాని చావు తీవ్రత గురించి, దాని దుర్భర స్థితి గురించి ఖుర్'ఆన్ హదీసులలో చెప్పబడిన విషయాలను బట్టి చూస్తే ప్రపంచ జీవితంలో ఎదురయ్యే కష్టాలు, కడగండ్లు, ఆపదలు, బాధలు, దుఃఖ విచారాలన్నిటిని కలిపితే ఎంత నొప్పి అవుతుందో చావు సంభవించినప్పుడు అంతకన్నా ఎక్కువ నొప్పి కలుగుతుందని తెలుస్తుంది. 

సూరే ఖాఫ్ అధ్యాయం;50, వాక్యం19 లో అల్లాహ్ తెలియజేస్తున్నాడు (و جاء ت سكرتل موت بالحق ) 

మరణ వేదన సత్యంతో వచ్చేసింది (ఖుర్'ఆన్; 50:19)

ఇక్కడ సత్యం అంటే సమాధి జీవితానికి సంబంధించిన వాస్తవాలు, నిజాలు. (మరణానంతరం) మనిషికి దైవదూతలు కనిపిస్తారు. తాను శిక్షకు గురికానున్నాడో లేక పుణ్యఫలం అనుభవించనున్నాడో అతనికి నమ్మకంగా తెలిసిపోతుంది.

మరణ పరిస్థితి, చావు తీవ్రతను, దాని దుర్భర స్థితిని ప్రస్తావిస్తూ అల్లాహ్ సెలవిస్తున్నాడు:

ప్రాణం గొంతులో వచ్చినప్పుడు, "మంత్రించి ఊదే వారెవరైనా ఉన్నారా? అని అడుగుతాడు. అప్పుడు మనిషి అది ప్రపంచం నుండి వేరైపోయే సమయమని తెలుసుకుంటాడు. అప్పుడు ఒక కాలు మరొక కాలుతో కలిసిపోతుంది. (ఖుర్'ఆన్; 75:26-29)

దైవ ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) "మృత్యువు బాధ చాలా తీవ్రంగా ఉంటుంది" అని చెప్పారు. (మస్నదె అహ్మద్) 

వేరొక హదీసులో (ప్రవక్త ప్రవచనం) ఆయన ఇలా ప్రబోధించారు. జీవన మాధుర్యాన్ని మరిపించే చావుని అత్యధికంగా గుర్తు చేసుకుంటూ ఉంటుంది" (తిర్మిజీ, ఇబ్నె మాజా, నసాయి)

ఈజిప్ట్ విజేత అమ్ర్ బిన్ ఆస్ (ర.జి) తాను బతికి ఉన్నప్పుడు "మరణించే సమయంలో స్పృహ, తెలివి ఉండికూడా మరణ పరిస్థితిని వివరించనివారిని చూస్తే నాకు ఆశ్చర్యమేస్తుంది." అని తరచూ అంటుండే వారు. కాని ఆ తర్వాత తనే మృత్యువు దరికి చేరుకున్నప్పుడు అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (ర.జి) ఆయనకు ఆయన అన్న మాట మరణబాధ వర్ణించరానిది. ఒక విషయం మాత్రం చెప్పగలను. ఇప్పుడు నాకు ఆకాశం విరిగి భూమి మీద పడినట్టు, నేను వాటి మధ్య నలిగి పోతున్నట్టు అనిపిస్తుంది. నా మెడ మీద పెద్ద పర్వతం ఉన్నట్లుంది. కడుపులో ఖర్జూరపు ముళ్ళు నింపినట్లుంది. శ్వాస సూది రంద్రం గుండా పోతుందా అన్నంత కఠినంగా ఉంది నా పరిస్థితి.

హజ్రత్ షద్దాద్ బిన్ ఔస్ (ర.జి) ఇలా అంటున్నారు: మృత్యువు ఘడియ ప్రపంచం, పరలోకంలోని బాధలన్నింటి కంటే తీవ్రంగా ఉంటుంది. అదే రంపపు కోతకన్నా బాధాకరంగా, కత్తెరల కత్తిరింపుల కన్నా నొప్పిగా, కుండల ఉడుకుదనం కన్నా తీవ్రంగా ఉంటుంది. మరణించే టప్పుడు  గనక ఒకసారి బతికి మరణ బాధ ఎలా ఉంటుందో  ప్రజలకు వివరిస్తే ఇక వారికి సుఖం ఉండదు. నిద్రా ఉండదు.

హజ్రత్ ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ (రహ్మతుల్లాహ్ అలై) ఈ విధంగా ప్రార్ధించే వారు:

"ఓ అల్లాహ్ నా మరణలోని తీవ్రతను తగ్గించు"

విశ్వాసి మరణ పరిస్థితి, చావు తీవ్రత:

దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం విశ్వాసికి, అవిశ్వాసికి వేర్వేరు మరణ పరిస్థితులు వివరించారు. దాని సారాంశం ఇది. విశ్వాసికి మరణ సమయం ఆసన్నమైనప్పుడు సూర్య తేజస్సు లాంటి మొహాలు కలిగిన దైవ దూతలు అతని శవ వస్త్రం (కఫన్) కోసం తమ వెంట స్వర్గం నుంచి పరిమళం గుభాళించే శ్వేతపట్టు వస్త్రం తీసుకుని వస్తారు. వచ్చి ఆ విశ్వాసికి "అస్సలాము అలైకుమ్" అని సలాం చెబుతారు. మృత్యు దూత ప్రాణం తీసేముందు "ఓ పవిత్రాత్మ! సంతోషించు, నీకు దేవుని కారుణ్యాలు లభిస్తాయి, స్వర్గానుగ్రహాలు ప్రాప్తిస్తాయి" అని శుభవార్త చెబుతారు. ఆ శుభవార్త  వినగానే విశ్వాసికి మనసులో అల్లాహ్ వద్ద వెళ్లాలని తీవ్ర వాంఛ కలుగుతుంది. దాంతో విశ్వాసి ప్రాణం కూజ నుంచి మూత  తీయగానే నీళ్ళు బయటికి వచ్చినట్లు బయటికి వస్తుంది. దైవ దూతలు ఆత్మను బయటికి తీసిన తర్వాత దాన్ని సువాసనలు గుభాళిస్తున్న తెల్లని పట్టు వస్త్రంలో చుట్టుకొని ఆకాశం వైపుకు తీసుకు వెళ్తారు. ఆ సమయంలో విశ్వాసి ఆత్మ నుంచి కస్తూరి లాంటి సువాసన వస్తూ ఉంటుంది. అది ఎంత ఘాటుగా ఉంటుందంటే ఆకాశంలో ఉండే దైవ దూతలు ఆ వాసన ఆస్వాదించి "ఏ విశ్వాసి ఆత్మో పైకి వస్తుంది" అని చెప్పుకుంటారు.

దైవదూతలు ఆకాశపు ద్వారం తడతారు. లోపలి నుంచి మొదటి ఆకాశపు దూతలు "ఈ పవిత్ర ఆత్మ ఎవరు? అని అడుగుతారు. దానికి సమాధానంగా దైవదూతలు "ఇతను ఫలానా ఫలానా అతని కుమారుడు" అని చెబుతారు. ఆకాశ దూతలు ద్వారం తెరుస్తారు. అతనికి స్వాగతాలు చెబుతారు. ఆ పవిత్ర ఆత్మకు దేవుని కరుణా కటాక్షాలు లభిస్తాయనే శుభవార్తను అందజేస్తారు. దైవదూతలు దాన్ని రెండవ ఆకాశానికి తీసుకు వెళతారు. అక్కడ కూడా విశ్వాసికి ఘన స్వాగతాలు లభిస్తాయి. తర్వాత మూడు, నాలుగు ఈ విధంగా ఏడో ఆకాశానికి ఆ ఆత్మ చేరుకుంటుంది. అక్కడికి చేరుకున్న తర్వాత "నా ఈ దాసుని పేరు ఇల్లియ్యీన్ (ఉన్నత స్థాయి వ్యక్తుల జాబితాలో) రాయమని దైవాజ్ఞ అవుతుంది. ఆ తర్వాత అతని ఆత్మను కొన్ని ప్రశ్నలు అడగటం కోసం తిరిగి దేహంలోకి ప్రవేశింప చేయడం జరుగుతుంది.

విశ్వాసి సమాధి పరిస్థితి:

సమాధిలోకి వచ్చే దూతలను మున్కిర్, నకీర్ అంటారు. వారి మొహాలు నల్లగా ఉంటాయి. నీలం రంగు మెరిసేటి పెద్ద కళ్ళు ఉంటాయి. పళ్ళు ఆవు కొమ్ముల్లా పెద్దగా ఉంటాయి. గొంతు పిడుగు లా గర్జిస్తూ ఉంటుంది. వారు దంతాలతో నేలను చీలుస్తూ దగ్గరికి వచ్చి అత్యంత కఠోర శబ్దంతో అడుగుతారు. "మన్ రబ్బుక ... నే ప్రభువు ఎవరు? మన్న బీయుక నీ ప్రవక్త ఎవరు? మా దీనుకు నీ ధర్మమేది?" అని.

సమాధి చీకటి అందులోనూ ఒంటరితనం. మున్కిర్ నకీర్ ల భయంకర మొహాలు, ఇవన్నీ చూసినప్పటికీ విశ్వాసికి ఎలాంటి భయాందోళనలు కలుగవు. ఆతను ఏంటో ప్రశాంతతతో ముంకిర్ నకీర్ ల ప్రశ్నలకు సమాధానం చెబుతాడు. విశ్వాసుల్లో కొందరికి సూర్యుడు అస్తమించ బోతున్నట్టు చూపించడం జరుగుతుంది. అదే చూసి విశ్వాసి దైవదూతల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సున్నితంగా నిరాకరిస్తూ "కాస్త ఆగండి నన్ను అస్ర్ నమాజ్ చేసుకోనివ్వండి, ఆ తర్వాత నేను మీ ప్రశ్నలకు సమాధానం చెబుతాను" అంటాడు. కాని ఆ తర్వాత అది  నమాజ్ చేసే స్థలం కాదని తెలియగానే ముంకిర్, నకీర్ ల ప్రశ్నలకు సమాధానం చెబుతాడు.

ఈ ప్రశ్నలు-సమాధానాల తంతు ముగిసిన తర్వాత నరకం వైపు ఒక రంద్రం చేసి దానివైపు చూపిస్తూ "ఇది అగ్ని అల్లాహ్ తన కరుణా కటాక్షాలతో నిన్ను దీన్నుంచి కాపాడాడు" అని చెప్పటం జరుగుతుంది. ఆ తర్వాత స్వర్గం వైపు ఒక రంద్రం చేయబడుతుంది. లేక ఒక స్వర్గ ద్వారం తెరవ బడుతుంది. విశ్వాసి దాని గుండా స్వర్గ వరాలను చూసి ఆనందిస్తాడు. అప్పుడు విశ్వాసికి స్వర్గంలో తనకు లభించబోయే ఇల్లు కూడా చూపించడం జరుగుతుంది. అతని సమాధి డెబ్భై గజాల వరకు లేక కనుచూపు మేరకు విశాల మవుతుంది. అందులో పౌర్ణమి నాటి పండు వెన్నెల కాస్తుంది. అతనికి పరిమళ భరిత స్వర్గ దుస్తులు తోడిగించడం జరుగుతుంది. సుగంధ భరిత, సుఖవంతమైన, మృదువుగా మెత్తగా ఉండే స్వర్గ పడక అతని కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత సమాధిలో అతని దగ్గరికి అందమైన ముఖారవిందంతో పరిమళభరిత దుస్తులను ధరించిన వ్యక్తి ఒకడు వస్తాడు. విశ్వాసి అతన్ని "ఎవరు నువ్వు?" అని అడుగుతాడు. దానికతను "నేను నీ సదాచరణను, పరలోక జీవితంలో నీకు సుఖాలు, బహుమానాల శుభవార్త అందజేయటానికి వచ్చాను" అని చెబుతాడు. అపుడు విశ్వాసి  ఓ నా ప్రభూ! ప్రళయం తొందరగా రానీ, "నేను నా ఇంటివారిని కలవాలి" అని కోరుకుంటాడు. నాకు కలిగిన ఈ శుభ పరిణామం గురించి వారికి తెలియజేయాలి, అని అంటాడు. దానికి సమాధానంగా దైవదూతలు (ఇప్పుడు ఇక్కడి నుండి తిరిగి వెళ్ళడానికి వీలు లేదు) కనుక నీవు ఒక నూతన వదువులాగా హాయిగా నిదురపో అని అంటారు. ఆ తర్వాత విశ్వాసి పడుకుంటాడు. చివరికి ప్రళయ దినాన అల్లాహ్ అతన్ని అతని సమాధి నుంచి లేపుతాడు. ఇక్కణ్ణుంచి పరలోక జీవితానికి సంబధించిన రెండవ దశ మొదలవుతుంది.

అవిశ్వాసి మరణ పరిస్థితి, చావు తీవ్రత:

అవిశ్వాసికి మరణ ఘడియలు సమీపించినప్పుడు అతని ఆత్మను తీసుకెళ్ళడానికి అత్యంత భయంకరమైన నల్లటి మొహాలు కలిగి ఉండే దైవదూతలు అతని శవ వస్త్రం కోసం దుర్గంధభరిత గోనెసంచి తీసుకొస్తారు. వచ్చి "ఓ నీచాత్మా! దైవాగ్రహానికి పాత్రమైన ఆత్మా! దైవాగ్రహానికి పాత్రమైన ఆత్మా! అని పిలుస్తారు. దైవాగ్రహం, నరక శిక్షల శుభవార్తలు దానికి అందజేస్తారు. అవిశ్వాసి ఆత్మ భయాందోళనల వల్ల దేహం నుంచి త్వరగా బయటికి రాదు. అప్పుడు దైవదూతలు పచ్చిగా ఉన్న ఉన్నిలో నుంచి ముళ్ళున్న ఇనుప కమ్మీని బలవంతంగా లాగి బయటికి తీస్తారు. ఈ మాటల్ని ఖుర్'ఆన్ ఇలా వివరించిది: "(అవిస్వాసుల ప్రాణాల్ని) మునిగి లాగితీసే దైవదూతల సాక్షిగా!"
(ఖుర్'ఆన్ 79:1)  అంటే అది బయటికి రానని మొండికేస్తుంది. అప్పుడు దైవదూతలు దాన్ని బలవంతంగా బయటికి తీస్తారు. మరో చోట అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

"ఈ దుర్మార్గులు మరణ వేదనలో మునిగి తేలుతూ ఉండగా, దైవదూతలు తమ హస్తాలను చాచి "ఇటు తెండి! బయటికి తీయండి మీ ప్రాణాలను, అల్లాహ్ పై అపనిందను మోపి అన్యాయంగా కోసిన కూతలకూ, ఆయన ఆయతుల (వాక్యాల) పట్ల తలబిరుసుతనం ప్రదర్శించినందుకు ఫలితంగా ఈ రోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది." అని అంటూ ఉండగా ఆ దృశ్యాన్ని నీవు చూడగలిగితే ఎంత బాగుండు! (ఖుర్'ఆన్; 6:93)

ఆ సమయంలో అవిశ్వాసి ఆత్మ నుంచి కుళ్ళి కృశించిపోయిన మృతకళేబరం నుంచి ఎంతటి అసహ్యకరమైన వాసన వస్తుందో అంతటి దుర్గంధం వస్తుంది. దైవదూతలు దాన్ని ఆకాశం వైపు తీసుకెళ్తున్నప్పుడు ఆకాశదూతలు దూరం నుంచే దాని దుర్వాసన చూసి "ఏదో పాడు ఆత్మ ఆకాశం వైపు తీసుకురాబడుతున్నట్లుంది." అని అనుకుంటారు. మృత్యు దూతలు ఆ దుర్గంధ భరిత అవిశ్వాసి ఆత్మను తీసుకొని మొదటి ఆకాశానికి చేరుకొని ద్వారం తడతారు. లోపలి నుంచి ద్వారపాలకులు "ఎవరి ఆత్మ ఇది?" అని అడుగుతారు. దానికి మృత్యు దూతలు "ఇతను ఫలానా, ఫలానా అతని కుమారుడు" అని చెబుతారు. అది విని ద్వారపాలకదూతలు "ఈ నీఛ దేహపు నీఛాత్మకు మా దగ్గర ఎలాంటి గౌరవం లేదు. దీనికోసం ఆకాశద్వారాలు తెరువ బడవు. దీనిని పరాభవం పాలుచేసి తిరిగి భూలోకానికే తీసుకు వెళ్ళండి." అని అంటారు. దాంతో మ్రుత్యుదూతలు అతని ఆత్మను మొదటి ఆకాశం దగ్గర్నుంచే భూమి మీదకు విసిరి పారేస్తారు. అటు అల్లాహ్ తరపునుంచి దాని పేరు సిజ్జీన్ (ఖైదీల పేర్ల జాబితా)లో రాయమని ఆజ్ఞ అవుతుంది. ఆ తర్వాత అతని ఆత్మను ప్రశ్నలు అడగటం కోసం తిరిగి దేహంలోకి వదిలేయటం జరుగుతుంది.

అవిశ్వాసి సమాధి పరిస్థితి:

సమాధిలో ముంకిర్, నకీర్ తన దగ్గరకు వచ్చినప్పుడు అవిశ్వాసి తీవ్రభయాందోళనకు గురౌతారు. ముంకిర్, నకీర్లు "మన్ రబ్బుక? మన్ నబియ్యుక? మా దీనుక?" అని అడుగుతారు. దానికి అవిశ్వాసి "హా, హా లా అద్ రీ; అయ్యో అయ్యో ... నాకు ఈ విషయాలేవీ తెలియవే!" అని వాపోతాడు. అదే కపట విశ్వాసి అయితే "ప్రజలు ఎం చెబుతుండగా విన్నానో నేనూ అదే చెబుతున్నాను" అని అంటాడు. అవిశ్వాసి లేక కపటి ఈ జవాబు చెప్పిన తర్వాత ఒక స్వర్గద్వారం, నీ అవిశ్వాసం లేదా నీ కపట రోగం మూలంగా దేవుడు నీకు ఇది దక్కకుండా చేశాడు" అని చెబుతారు. ఆ తర్వాత అతని కొరకు నరకం వైపు ఉండే ద్వారం ఒకటి తెరువబడుతుంది. దాని ద్వారానే అతనికి అగ్నిశిక్ష విధించబడుతుంది. నరకంలో తన నివాసం కూడా అతనికి చూపెట్టబడుతుంది. అప్పుడు అతనికి అగ్ని వస్త్రాలు తొడిగించమని, అతని కోసం అగ్ని పడక సిద్ధం చేయమని అల్లాహ్ తరపునుంచి ఆజ్ఞ అవుతుంది. అతన్ని శిక్షించటం కోసం అంధులు మూగులైన దూతలు నియుక్తులౌతారు. వారు అతన్ని గదలతో చితకబాదుతూ ఉంటారు. దైవ ప్రవక్త (స.అ. సం) ఇలా చెప్పారు: ఆ గద ఎంత బరువు ఉంటుందంటే దాంతో కొండను కొడితే కొండ కూడా తుక్కు తుక్కు అయిపోతుంది. అంతే కాదు ఆ అవిశ్వాసి మీదకు తొంభై తొమ్మిది సర్పాలు వదలటం జరుగుతుంది. అవి అతన్ని ప్రళయం వరకూ కాటేస్తూ ఉంటాయి. దైవ ప్రవక్త (స.అ.సం) ఇలా ప్రవచించారు. సమాధి సర్పం ఎంత విషపూరితంగా ఉంటుందంటే అదే నేలమీద ఒకసారి ఊడితే చాలు ఇక అక్కడ మొక్క అనేది మొలకెత్తదు. ఈ శిక్షలతో పాటు అవిశ్వాసికి ఇంకో శిక్ష కూడా ఇవ్వబడుతుంది. అదేమిటంటే, సమాధి గోడలు మాటి మాటికి బిగుసుకు పోతుంటాయి. దాని మూలంగా అతని పక్కటెముకలు ఒకదానిలోకి ఒకటి చొచ్చుకు పోతాయి. అవిశ్వాసికి ఈ శిక్షలన్నీ ప్రళయం వరకూ ఇవ్వబడతాయి.

సమాధిలో అవిశ్వాసి దగ్గరకి తీవ్ర భయంకరమైన, దుర్గంధ భరితమైన మహా కురూపి ఒకడు వస్తాడు. అతన్ని చూడగానే అవిశ్వాసి భయంతో "ఎవ్వర్నువ్వు" అని అడుగుతాడు. దానికి ఆ కురూపి " నేను నీ కర్మను. నీకు చెడు పరిణామ వార్త అందజేయడానికి వచ్చాను" అని అంటాడు. దాంతో అవిశ్వాసి భయపడి "ఓ నా ప్రభు! ప్రళయాన్ని రానీయకు' అని వేడుకుంటాడు. ఈ విధంగా అవిశ్వాసి మృత్యు ఘడియ నుంచే దైవ శిక్షకు గురై ప్రళయం వరకూ నిరంతరాయంగా ఇలాంటి శిక్షలు అనుభవిస్తూ ఉంటాడు. అల్లాహ్ తన కృపతో, అనుగ్రహంతో ప్రతి ముస్లిం ని సమాధి శిక్ష నుంచి కాపాడు గాక! ఆమీన్.

ఈ ప్రశ్న-సమాధానాల తంతు ముగిసిన తర్వాత విశ్వాసి ఆత్మను 'ఇల్లియ్యీన్' లో ఉంచటం జరుగుతుంది. పొతే అవిశ్వాసులు, కపతులు, బహుదైవారాధకుల ఆత్మలు 'సిజ్జీన్'లో బంధించబడతాయి. ఇక్కడ ఒక విషయం గమనార్హం. విశ్వాసుల పేర్లు నమోదు చేసే గ్రంధాన్ని (రిజిస్టర్), విశ్వాసుల ఆత్మలు ప్రళయం వరకూ ఉంచబడే స్థలాన్ని- రెండిటినీ 'ఇల్లియ్యీన్' అనే పిలుస్తారు. అలాహే అవిశ్వాసుల, బహుదైవారాధకుల పేర్లు నమోదు చేయబడే పుస్తకానికి, వారి ఆత్మలు ప్రళయం వరకూ బంధించబడే ప్రదేశాన్ని రెండిటికీ 'సిజ్జీన్'అనే పేరు! వాస్తవం అల్లాహ్ కె బాగా తెలుసు.

సమాధి కంటే దుర్భరమైన, ఆందోళనకరమైన స్థలం మరొకటి లేదు

ఇదండీ! దుర్భేద్య కనుమ లాంటి సమాధి గాధ! దీని గురించే దైవ ప్రవక్త (స.అ.సం) "నేను సమాధి కంటే దుర్భరమైన, ఆందోళనకరమైన స్థలం మరొకటి చూడలేదు" అని అన్నారు. (తిర్మిజీ) ఈ సమాధి యాతన బారినుంచి శరణు వేడుకోమనే ఆయన తన సహచరులకు బోధించారు. (అహ్మద్). హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (ర.జి) ఇలా అంటున్నారు. దైవ ప్రవక్త (స.అ.సం) మాకు సమాధి శిక్ష నుంచి శరణు వేడుకునే ప్రార్ధన ఖుర్'ఆన్ సూక్తులు నేర్పించినట్లు నేర్పించారు (నసాయి). ఒకసారి ఆయన ఉపన్యాసమిస్తూ తన అనుచరులను ఆప్రమత్తం చేయటానికి వారితో "మీరు సమాధుల్లో దజ్జాల్ ఉపద్రవం ద్వారా పరీక్షించబడినట్లు పరీక్షించ బడతారు." అని అన్నారు. ఆ మాట వినగానే అశ్రువులు ధారలై ప్రవహించేలా ఏడ్చారు (నసాయి). విస్వాసుల నాయకులు హజ్రత్ ఉస్మాన్ (ర.జి) తనకు సమాధి విషయం గుర్తుకొస్తే కన్నీళ్ళతో గడ్డం తడిచిపోయేలా ఏడ్చారు. పైగా ఇలా అనేవారు. "పరలోక జీవితంలో సమాధి మొదటి దశ. సమాధిలో ముక్తి పొందిన వాడికి తర్వాతి దశలు కూడా సులభమై పోతాయి. ఈ దశలో ముక్తి లభించని వాడికి మిగతా దశలు దీనికంటే దుర్భరంగా ఉంటాయి (తిర్మిజీ).

సమాధి గురించి విన్న ప్రవక్త సహచరుల పరిస్థితి 

హజ్రత్ ఉమర్ (ర.జి) సమాధిని, పరలోక జీవితాన్ని గుర్తుకు తెచ్చుకొని ఎంతగా విలపించేవారంటే ఆ విధంగా విలపిస్తూ విలపిస్తూ ఆయన మొహం మీద రెండు చారలు ఏర్పడ్డాయి (బైహఖీ). దైవ ప్రవక్త (స.అ.సం) మృత్యువు మరియు సమాధి గురించి ఉపన్యాసం ఇస్తుండగా అబూ జర్ గఫ్ఫారి (ర.జి) విని "అయ్యో! నేను చెట్టునయ్యి ఉంటె బాగుండేది, ఎవరి చేతనయినా కోయబడే వాడిని" అనుకున్నారు (ఇబ్నేమాజ). హజ్రత్ అబూ హురైరా (ర.జి) తనకు మరణ ఘడియ ఆసన్నమైనప్పుడు ఏడవటం మొదలు పెట్టారు, ప్రజలు చూసి "అబూ హురైరా! ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సి వస్తున్నందుకు ఏడుస్తున్నావా?" అని అడిగారు. అందుకాయన "కాదు, ప్రయాణం చూస్తే బహు సుదీర్ఘమైనది. నా దగ్గరేమో సామగ్రి కొంతే ఉంది. అందుకని ఏడుస్తున్నాను. నా పరిస్థితి ఎలాగుందంటే నేనొక ఎత్తయిన గుట్ట మీద నించున్నాను. దాని ముందు స్వర్గమైనా ఉంటుంది లేక నరకమైనా ఉంటుంది. వాటిలో నా గమ్యస్థానం ఏదో నాకు తెలియదు" అని విచారం వ్యక్తం చేశారు (కితాబుజ్జుహద్).

భయంకరమైన సమాధి కనుమను తలచుకొని మన పూర్వికులు ఎంతగా భయపడి పోయేవారో ఈ రోజు మనం దాని గురించి అంతగా నిర్భయులయిపోయాము, నిర్లక్ష్యం చేస్తున్నాం. ప్రపంచపు రంగుల హరివిల్లుకు ఎంతగా మంత్రముగ్దులయిపోయామంటే, దాని తళుకు బెళుకులకు ఎంతగా తన్మయులై పోయామంటే ఎప్పుడైనా పొరపాటున కూడా మనకు సమాధి గుర్తుకు రాదు. మన ఈ అజాగ్రత్తకు, నిర్లక్ష్యానికి, ఏమరుపాటుకు ఖుర్'ఆన్ చేసిన తీర్మానం సరిగ్గా అవుతుంది:

(إقتراب لناس حسابهم وهم في غفلته معرضون"(قرآن؛ 21 : 1"

"మానవుల లెక్కల సమయం సమీపించింది, అయినా వారు ఏమరు పాటులో పడి విముఖులై ఉన్నారు." (ఖుర్'ఆన్; 21:1)

అల్లాహ్ తన కరుణా కటాక్షాలతో మన పరిస్థితి మీద దయచూపు గాక! చనిపోక ముందే దుర్బేధ్యమైన సమాధి కనుమ గుండా ప్రయాణించడానికి ఏమైనా సన్నాహాలు చేసుకునే సద్బుద్ధిని ప్రసాదించు గాక! ఆమీన్ !!!

సమాధి పరీక్షల్లో విజయం సాధించటానికి మొట్టమొదటి మరియు ప్రధమ నియమం ఏకదైవ విశ్వాసం. కనుక ప్రతి ముస్లిం తన విశ్వాసాన్ని చిన్న పెద్ద అన్ని రకాల షిర్క్ ల నుంచి పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత తన ఆచరణలన్నిటికీ దాన్నే ఆధారంగా చేసుకోవాలి. 

దైవ ప్రవక్త (స.అ.సం ) ప్రవచనం ద్వారా బోధపడుతున్న రెండో విషయం ఏమిటంటే తౌహీద్ విశ్వాసాన్ని అనుసరించి ఆచరించినప్పటికీ సమాధి పరీక్షల్లో స్థైర్యం అనేది కేవలం అల్లాహ్ కరుణా కటాక్షాలతోనే ప్రాప్తమౌతుంది. కనుక విశ్వాసాలను, ఆచరణలను సంస్కరించుకున్న తర్వాత దైవ సిన్నిధిలో చేతులెత్తి ఆయన్ని దయా భిక్ష పెట్టమని వేడుకోవాలి.

"రబ్బనా జలమ్నా అన్ ఫుసనా వ ఇల్లమ్ తఘ్ఫిర్లన వ తర్ హమ్ లా లన కూనన్న మినల్ ఖాసిరీన్"

ఓ మా ప్రభూ! మేము మా ఆత్మలకు అన్యాయం చేసుకున్నాము, నీవు గనక మమ్మల్ని క్షమించకపొతే, మా మీద దయ జూపకపోతే మేము నష్ట పోయేవారిలో కలిసి పోతాము. (ఖుర్'ఆన్ ; 7:33)

దైవ దూతలు "మిమ్మా యుద్రీక" నీకు ఈ విషయాలు ఎలా తెలిశాయి  అని అడుగుతారు. దానికి విశ్వాసి "నేను దైవ గ్రంధం చదివాను, దాన్ని విస్వసించాను, దాన్ని ధ్రువీకరించాను"అని చెబుతాడు. (అహ్మద్,అబూదావుద్)
సరైన సమాధానం చెప్పలేక పోయిన దురదృష్టవంతులను దైవ దూతలు "నీవు తెలుసుకోలేదా?" నీవు ఖుర్'ఆన్ చదవ లేదా? అని అడుగుతారు. ఆ తర్వాత అతని రెండు చెవుల మధ్య ఇనుప సుత్తెలతొ కొడతారు. ఆ దెబ్బలకు అతను చాలా భయంకరంగా అరవటం మొదలు పెడతాడు. అతని అరుపుల్ని, జున్నుల, మానవుల తప్ప మిగతా సృష్టిరాసులన్నీ వింటాయి. (బుఖారి;అబూదావుద్) 


విశ్వాసి మరియు అవిశ్వాసికి వేయబడిన ఈ నాల్గవ ప్రశ్న ద్వారా ఈ క్రింది విషయాలు బోధ పడుతున్నాయి.

1. ముంకిర్, నకీర్ దూతలు వేసే మూడు ప్రశ్నలకు సరైన సమాధానాలు అందించగల గ్రంధం ఖుర్'ఆన్ మాత్రమే.

2. ఖుర్'ఆన్  గ్రంధాన్ని విశ్వసించి, దాన్ని పారాయణం చేసి, అర్ధం చేసుకొని, దాన్ని ఆచరించినవారు మాత్రమే సమాధి శిక్షలో కృతకృత్యులవుతారు.

3. మరణానంతరం అవిశ్వాసికి లేక బహుదైవారాధకుని మీద మొట్టమొదట నువ్వు దివ్యఖుర్'ఆన్ ఎందుకు చదవలేదు. దాన్ని అర్ధం చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించలేదు? అన్న నేరం మోపబడుతుంది.

4. దివ్యఖుర్'ఆన్ చదవని, అర్ధం చేసుకొని నేరానికి ముద్దాయిని రెండు చెవుల మధ్య అనగా మెదడు మీద గదతో కొట్టడం జరుగుతుంది. దీని ద్వారా అర్ధమయ్యేదేమిటంటే దేవుడు మెదడు దివ్యఖుర్'ఆన్ చదవడం కోసం, దాన్ని అర్ధం చేసుకోవడం కోసం ప్రసాదించాడు. కనుక ఏ లక్ష్యం కోసమైతే అది పుట్టించబడిందో దాన్ని ఆ లక్ష్యం కోసం వినియోగించని కారణంగా అవిశ్వాసికి ఈ శిక్ష విధించబడుతుంది.

మనకు ప్రతిరోజూ వార్తాపత్రికలు చదవడానికి ఒకటిరెండు గంటల సమయం దొరుకుతుంది. కాని దివ్యఖుర్'ఆన్ చదవడానికి, అర్ధం చేసుకోవడానికి, యోచన చేయడానికి పట్టుమని పది నిమిషాలైన దొరకవు. ఎంతటి శోచనీయమైన వాస్తవం. మనదేశంలో 90 శాతం కుటుంబాలు తమ కుటుంబ సభ్యులందరితో పాటు T.V ముందు కూర్చొని తమ ప్రియమైన తమ జీవితంలోని ఎన్నో విలువైన గంటల సమయం వృధా చేస్తున్నారు. కాని కుటుంబ సభ్యులతో ఖుర్'ఆన్ చదవటానికి, చదివించుకోవడానికి కొన్ని నిముషాలైనా దొరకవు. ఖుర్'ఆన్ పట్ల ఈ విధమైన అజాగ్రత్త, నిర్లక్ష్యానికి ఒక కారణం దివ్యఖుర్'ఆన్ ప్రాముఖ్యత గురించి తెలియకపోవటం. ఈ ప్రపంచంలో మనకు ఎదురయ్యే వ్యక్తిగత, సామాజిక సమస్యలకు, దుఃఖవిచారాలకు, రోగాలకు చికిత్స ఖుర్'ఆన్ ఒక్కటేనని, ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించి వెళ్ళిపోయిన తర్వాత పితృలోకంలో కూడా మన ముక్తికి, భద్రతకు సాధనం ఈ ఖుర్'ఆన్ యే నని, ఆ తర్వాత పరలోకంలో దైవ సన్నిధిలో మన గురించి సిఫారసు చేసేది కూడా ఈ ఖుర్'ఆన్ గ్రంధమేనని మనకు తెలియదు.

ఖుర్'ఆన్ కు దూరమైపోవడానికి, దాని విషయంలో అజాగ్రత్తకు పాల్పడటానికి మరో కారణం దాని పఠనం చాలా కష్టమని భావించటం. కేవలం పండితులు మాత్రమె దాన్ని చదివి అర్ధం చేసుకోగలరు, సామాన్యులకు అది సాధ్యం కాని పని అని తలపోయటం. ఆ మాటే గనక నిజమైతే సమాధిలో ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేక పోయేవారి మీద ఖుర్'ఆన్ చదవలేదు, దాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించలేదు అన్న అభియోగం ఎందుకు మోపబడాలండీ? అల్లాహ్ ఈ అపోహను ఖుర్'ఆన్ లో త్రోసిపుచ్చుతూ ఇలా సెలవిచ్చాడు: "మేమీ ఖుర్'ఆన్ ని ప్రజలు గ్రహించడానికి సులభతరం చేశాం. మరి దీన్నుండి హితబోధ గ్రహించేవారెవరైనా ఉన్నారా?(ఖుర్'ఆన్;54:17)   

ఈ క్రింది ఆచరణలు చేస్తే మనల్ని మనం సమాధి శిక్షల నుండి కాపాడు కోవచ్చు. 

1. దైవ మార్గంలో ప్రాణాలు కోల్పోవడం:- దైవ ప్రవక్త (స.అ. సం) ప్రవచనం, "దైవమార్గంలో ప్రాణాలు అర్పించే ఆదరణ సమాధి శిక్షల నుండి సురక్షితంగా ఉంచుతుంది. (నసాయి)

2.  మురాబితా:- అంటే ఇస్లామీయ రాజ్య సరిహద్దులకు లేక ఇస్లామీయ సైన్యానికి కాపలా కాయటం. ఈ ఆచరణ కూడా సమాధి శిక్షల నుండి కాపాడుతుంది. (తిర్మిజీ)

3.  ముల్క్ సూరా ను అత్యధికంగా పారాయణం చేయటం:- దైవ ప్రవక్తదైవ ప్రవక్త (స.అ. సం) ప్రవచనం: సూరే ముల్క్ సమాధి ఉపద్రవాన్ని అడ్డుకుంటుంది. (హాకిమ్) దైవ ప్రవక్త (స.అ. సం) ప్రతి రోజూ పడుకునే ముందు సూరే ముల్క్ ను పారాయణం చేసే వారు అన్న విషయం గమనించ దగ్గది. (అహ్మద్, తిర్మిజి, దారిమి)

4.  దివ్య ఖుర్'ఆన్ పారాయణం: ఖుర్'ఆన్ పారాయణం కూడా సమాధి సిక్షలనుండి కాపాడే ఆచరణే. (తబ్రానీ) 

5. మస్జిద్ వైపు వేసే అడుగులు: మస్జిద్ వైపు వేసిన అడుగులు కూడా మనిషిని సమాధి ఉపద్రవం నుంచి సురక్షితంగా ఉంచుతాయి. (తబ్రాని)

6. నమాజు 7. ఉపవాసాలు 8. జకాతు 9. నఫిల్ (స్వచ్చంద) దానధర్మాలు 10. నఫిల్ నమాజు 11. బంధువులతో సత్సంబంధాలు 12. ప్రజలకు ఉపకారం చేయడం.

దైవ ప్రవక్త (స.అ. సం) ఎలా ప్రబోధించారు. సమాధిలో యాతన దూత (మృతుని దగ్గరకు) తల వైపు నుంచి వెళ్లాలని అనుకుంటాడు. కాని నమాజు అతన్ని ఆపి "ఇటునుంచి దారిలేదు, వేరే వైపు నుంచి వెళ్ళు" అని అంటుంది. ఆ దూత మృతుని కుడివైపు నుంచి రావాలనుకుంటాడు. అంతలో ఉపవాసం అడ్డుకొని "ఇటునుంచి దారి లేదు" వేరే దారి గుండా వెళ్ళు అని అంటుంది. ఆ దూత ఎడమ వైపు నుంచి వెళ్ళాలను కుంటాడు. కాని జకాతు అతన్ని "ఇటునుంచి దారి లేదు వేరే దారి గుండా వెళ్ళు" అని అంటుంది. ఆ తర్వాత దూత కాళ్ళ వైపు నుంచి దగ్గరికి వెళ్లబోతాడు. అప్పుడు ఇతర సత్కార్యాలు, ఉదాహరణకు దానధర్మాలు, బంధువులతో సత్సంబంధాలు, ప్రజోపకారము మొదలగునవి అన్నీ అతన్ని అడ్డుకొని "ఇటునుంచి దారి లేదు వేరే దారి గుండా వెళ్ళు" అని అంటాయి. (ఇబ్నె హిబ్బాన్) 

ఇంకా రెండు ఉన్నాయి, వాటిలో మొదటి గురువారం రాత్రి లేక శుక్రవారం రోజు మరణించటం. రెండోది, ఉదార సంబంధ వ్యాధి. అయితే ఈ రెండు సందర్భాలు మనిషి అధీనంలో లేవు. ధర్మంలో ఆదేశాలన్నీ ఏ విధంగా ముడిపడి ఉన్నాయంటే, వాటిలో ఒకదానినుంచి ఒకటి వేరుచేసి ఏదైనా ఫలితం నిర్ణయించటం చాలా పెద్ద తప్పు. ఉదా:- ఎవరైనా గురువారం రాత్రి లేక శుక్రవారం పగలు మరణించాడు, కాని మరో వైపు నమాజులు ఎగరవేసే వాడనుకోండి శుక్రవారం రోజు మరణించడం అతనికి ఏమాత్రం ప్రయోజనం కాజాలదు. ఎవడైతే ఇస్లామీయా ప్రధానాంశాలు నిక్కచ్చిగా పాటిస్తాడో, తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు, బంధుమిత్రుల హక్కులను నెరవేరుస్తాడో, ధర్మాధర్మాల మధ్య విచక్షణ చూపుతాడో, ఇతర వ్యవహారాల్లో కూడా అల్లాహ్ కు ఆయన దైవ ప్రవక్త (స.అ. సం) కు విధేయత చూపుతాడో అతనికి మాత్రమే ఆ రోజు ప్రయోజనకరం కాగలుగుతుంది.

సమాధిలో నమాజీకి సత్కారం:

నమాజు ఇస్లాం ధర్మపు రెండవ ప్రధానాంశం: దీని ఘనత, విశిష్టతలకు సంబంధించి దైవ ప్రవక్త (స.అ. సం) నుంచి ఎన్నో హదీసులు ఉల్లేఖించబడ్డాయి. ఆయన ఎలా ప్రవచించారు. రోజుకి ఐదుసార్లు స్నానం చేసేవాడు మాలిన్యం, అశుద్ధతల నుంచి ఏవిధంగా పరిశుభ్రంగా ఉంటాడో 5 పూట నమాజు చేసేవాడు కూడా పాపాలనుంచి అదే విధంగా పరిశుభ్రంగా ఉంటాడు (బుఖారి, ముస్లిం) వేరొక హదీసులో 5 పూటల నమాజు చేసేవారికి అల్లాహ్ స్వర్గం ఇస్తానని వాగ్దానం చేశాడని ఉంది. (అహ్మద్, అబూదావుద్) దైవ ప్రవక్త (స.అ. సం) జీవితంలోని చివరి విల్లు కూడా నమాజు గురించే జరిగింది. ప్రజలారా! నమాజ్ ను కాపాడుకోండి, మీ బానిసలను దృష్టిలో పెట్టుకోండి అని హితోపదేశం చేశారాయన. (ఇబ్నె మాజా)  

ప్రళయానికి ముందే నమాజు తనను పాటించేవారి కొరకు ఎంతటి కారుణ్య ప్రదమైనదో, అది వారి ప్రాణాలకు ఎంతటి హాయినిస్తుందో దీని ద్వారా తెలుసుకోవచ్చు. ప్రళయ దినాన దేవుని హక్కుల్లో అన్నిటికంటే ముందు నమాజు గురించే లెక్క తీసుకోబడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.  (తిర్మిజీ)

దైవ గ్రంధం, దైవ ప్రవక్త (స.అ. సం) ప్రవచనాల వెలుగులో మృతులు వినటం గురించి:

మొదటి నుంచి చివరిదాకా మానవజీవితం మొత్తాన్ని మనం ఈ క్రింద పేర్కొనబడిన ఐదు దశలుగా విభజించవచ్చు.
1. ఆత్మల లోకం: అల్లాహ్ ఆదమ్ (అ.స) ను పుట్టించిన తర్వాత ఆయన వీపునుంచి ప్రళయం వరకూ రానున్న ఆయన సంతానం ఆత్మలను పుట్టించాడు. వాటికి మాట్లాడే, ఆలోచించే శక్తిని ప్రసాదించి వాటి చేత తాను విశ్వమంతటికీ ఏకైక ప్రభువు అన్న ఒప్పుకోలును ఈ మాటల్లో ఒప్పించాడు. వారిని 'అలస్తు బిరబ్బికుమ్' (నేను మీ ప్రభువును కానా?) అని అడిగాడు. దానికి ఆత్మలన్నీ "బలా (ఎందుకు కాదు! మీరే మా ప్రభువు)" అని సమాధానమిచ్చారు. (ఖుర్'ఆన్; 7:172) ఈ ఆత్మలోకం నుంచే మానవ జీవిత ప్రయాణం మొదలవుతుంది.

2. మాతృ గర్భ లోకం: మాతృ గర్భంలో ఆత్మతోపాటు మనిషి దేహనిర్మాణం కూడా జరుగుతుంది. ఈ లోకంలో మనిషి ఇంచుమించు తొమ్మిది నెలలపాటు ఉంటాడు. దీని గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "మానవుని తల్లి ఎంతో శ్రమకోర్చి అతన్ని తన గర్భంలో పెట్టుకొని మోపింది. ఎంతో శ్రమకోర్చి అతన్ని కన్నది. (ఖుర్'ఆన్; 46:15) మనిషి జీవిత ప్రయాణంలో ఇది రెండో దశ.

3. జీవలోకం: జీవిత ప్రయాణంలో మూడో దశ ఇది. ఇందులో ఓ సంక్షిప్త కాలంపాటు మనిషి జీవించి ఉంటాడు. "నా సమాజంలోని ప్రజల వయస్సులు అరవై డెబ్భై ఏళ్ల మధ్య ఉంటాయి" అని దైవ ప్రవక్త (స.అ. సం) ప్రవచించారు. (తిర్మిజీ) ఇంచుమించు ఇంత కాలమే మానవులు ఈ ప్రపంచంలో జీవించి ఉంటారు. ఆ తర్వాత తమ ప్రయాణంలోని తర్వాతి దశకు బయలుదేరుతారు.

4. సమాధి లోకం: మన ఈ ప్రయాణంలో సమాదిలోకం (జీవలోకంతో పోల్చుకుంటే) చాలా పెద్ద దశ. ఆదమ్ (అ.స) నుంచి నేటివరకు దాదాపు ఆరు వేల సంవత్సరాల కాలం గడిచిందని చెబుతారు.(నిజమేమిటో అల్లాహ్ కె తెలుసు) చనిపోయిన వారు తమ సమాధుల్లో పడిపోయి ఉన్నారు. వారి ప్రయాణం కొనసాగుతుంది.  ఎప్పటి వరకు కొనసాగుతుందో తెలియదు. సమయం వచ్చినప్పుడు మనలోని ప్రతీ ఒక్కడు ఈ సమాధిలోక ప్రయాణ బృందంలోకి చేరుకుంటూ ఉంటాడు. ఈ ప్రయాణం ప్రళయం వరకు కొనసాగుతుంది.

5. పరలోకం: ఇది మన ప్రయాణానికి అంతిమగమ్యం. ఇందులో మనిషి తన ప్రాపంచిక దేహం, ప్రాణాలతో సహా బతికించబడతాడు. అతను చేసిన మంచి చెడుల విచారణ జరుగుతుంది. ఆ తర్వాత ప్రజలు తమ తమ వాస్తవ నివాస స్థలాల్లో అంటే స్వర్గం లేక నరకంలో... శాస్వతంగా నివాసముంటారు.

సమాధి శిక్ష ఆత్మకా? లేక శరీరానికా?

సమాధిలో లభించే శిక్షాబహుమానాల గురించి చదివినప్పుడు "సమాధిలో శిక్ష లేక బహుమానాలు లభించేది ఆత్మకా? లేక శరీరానికా? లేక రెండింటికా?" అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.

పండితులు ఈ విషయం పై సుదీర్ఘమైన చర్చలు జరిపారు. కొందరి శరీరాన్నికొంత కాలం తర్వాత మట్టి తినేస్తుంది. మరేమో బహుమానం లేక శిక్ష అనేది ప్రళయం వరకు మిగిలి ఉంటుంది. కనుక ఈ శిక్ష లేక బహుమానం అనేది ఆత్మకే లభిస్తుంది అని అభిప్రాయ పడ్డారు. సమాదిలోకంలో శిక్ష లేక బహుమానం అనేది సమాధికి సంబంధించినది విశ్వాసి కొరకు సమాధి విశాలమౌతుంది. అందులో వెలుతురు ఉంటుంది. అవిశ్వాసి పైకి సర్పాలు సమాదిలోనే వదలబడతాయి. సమాధి గోడలు మాటిమాటికి శవాన్ని వత్తుతూ ఉంటాయి. సమాధిలో కేవలం శరీరం మాత్రమె ఉంటుంది. కావున శరీరంలోని ఒక్క అనువు మిగిలి ఉన్నా సమాధి శిక్ష లేక బహుమానం దానికే కలుగుతుందని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఇంకొందరి అభిప్రాయం ప్రకారం ఆత్మ మరియు శరీరం వేర్వేరుగా ఉన్నా వాటి మధ్య అగోచరమైన సంబంధం ఉంటుంది కనుక శిక్షా బహుమానాలు ఆ రెండింటికి కలుగుతాయి.

మా దృష్టిలో ఈ విషయం కూడా ఆ కోవకు చెందినదే. అంటే దీనిని విశ్వసించడం విధి. అయితే దాని స్థితి గురించి మాత్ర్యం మనకు తెలియదు. అల్లాహ్ కు పూర్తి అధికారం ఉంది. ఆయన తలచుకుంటే కుళ్ళి కృశించి మట్టిలో కలిసిపోయిన శరీరానికి లేక ఆత్మకు లేక రెండిటికి శిక్షా బహుమానాలు ఇవ్వగలదు, మా దృష్టిలో ఇది ఫలితం లేని వృధా చర్చ. అందులో పది మేము మా సమయాన్ని పాఠక మహాశయుల సమయాన్ని వృధా చేయదలచు కోలేదు. ఈ చర్చకు మన సంమార్గంతో ఏ మాత్రం సంబంధం ఉండి ఉన్నా దైవ ప్రవక్త (స.అ. సం) దాన్ని తప్పకుండా వివరించి ఉండేవారు. కనుక మనం దైవ ప్రవక్త (స.అ. సం) చెప్పిన మాటతోనే సంతృప్తి చెందాలి. ఆ మాట ఏమిటంటే సమాధి శిక్ష తధ్యం. దాన్నుంచి శరణు వేడుకోండి. ఆల్లాహ్ మనల్ని ఆ సమాధి శిక్ష నుంచి కాపాడు గాక! ఆమీన్

మరణాన్ని గుర్తు చేసుకుంటూ ఉండటం అభిలషణీయం

 మరణాన్ని వీలైనంత గుర్తు చేసుకుంటూ ఉండాలి. 

హజ్రత్ అబూహురైరా (రజి) కథనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ. సం) ఇలా ప్రబోధించారు. రుచులను మరిపించేది... అనగా చావుని అత్యధికంగా గుర్తు చేసుకుంటూ ఉండండి. (ఇబ్నె మాజా; సహీహ్)

మరణాన్ని అత్యధికంగా గుర్తు చేసుకునేవారు తెలివిగల వారు. 

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (ర.జి) కథనం ప్రకారం నేను దైవ ప్రవక్త (స.అ. సం) వెంట ఉన్నప్పుడు ఒక అన్సారీ వ్యక్తీ ఆయన దగ్గరకి వచ్చి సలాం చేశాడు. తర్వాత దైవ ప్రవక్తా! విశ్వాసుల్లో అందరికంటే గొప్పవారు ఎవరు? అని అడిగారు. అందుకు సమాధానంగా దైవ ప్రవక్త (స.అ. సం) "ఉత్తమ నడవడిక గల వారు" అని చెప్పారు. ఆయన (రజి) విశ్వాసుల్లో అందరికంటే తెలివిగలవారు ఎవరు? అని అడిగారు. అందుకు దైవ ప్రవక్త (స.అ. సం) "మరణాన్ని అత్యధికంగా గుర్తు చేసుకునే వారు" అని చెప్పారు. "మరణానంతర సమయం కోసం బాగా సన్నాహాలు చేసుకునేవారు అందరికంటే తెలివిగలవారు" (ఇబ్నె మాజా; హసన్)      

అమరగతి (షహాదత్) ను పొందటం కోసం ప్రార్ధించ వచ్చు. 

దైవ ప్రవక్త (స.అ. సం) ఇలా అంటుండగా తాను విన్నానని అబూహురైరా (ర.జి) తెలియజేశారు. ఎవరి చేతులోనైతే నా ప్రాణం ఉందో ఆయన సాక్షిగా చెబుతున్నాను. అల్లాహ్ మార్గంలో చంపబడి తిరిగి బతకాలనీ, మళ్ళీ చంపబడి మళ్ళీ బతకాలని మళ్ళీ చంపబడాలని నాకు కోరికగా ఉంది. (బుఖారి)

మరణ బాధ చాలా తీవ్రంగా ఉంటుంది:

హజ్రత్ జాబిర్ (ర.జి) కథనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ. సం) ఇలా ప్రబోధించారు. మరణం రావాలని కోరుకోకండి. మరణ సమయంలో కలిగే బాధ చాలా తీవ్రంగా ఉంటుంది. అల్లాహ్ ఏ దాసునికయినా దీర్ఘాయుషునిచ్చి అతనికి తౌబా (క్షమాపణ) చేసుకునే అవకాశాన్ని ప్రసాధించాలంటే అతను దాన్ని తన అదృష్టానికి సూచనగా భావించాలి. (అహ్మద్; హసన్)

మరణ సమయంలో విశ్వాసికి లభించే సత్కారాలు 

మరణ సమయంలో విశ్వాసికి 10 రకాల సత్కారాలు లభిస్తాయి.

1. దైవదూతలు ప్రాణం తీసేముందు అతనికి 'అస్సలాము అలైకుమ్' అని సలాం చేస్తారు.

2. విశ్వాసి ప్రాణం తీయడానికి వచ్చే దూతల మొహాలు సూర్యుని లా తేజోవంతంగా ఉంటాయి.

3. కారుణ్య దూతలు తమవెంట స్వర్గం నుంచి విశ్వాసి ఆత్మను చుట్టుకొని తీసుకెళ్లటం కోసం తెల్లని వస్త్రం (కఫన్) తీసుకొని వస్తారు.

4. ఆత్మను సుగంధభరితం చేయడం కోసం దూతలు తమవెంట స్వర్గం నుంచి పరిమళం కూడా తీసుకొని వస్తారు.

5. విశ్వాసి ప్రాణం తీసేటప్పుడు దూతలు అతనికి దేవుని మన్నింపు, ఆయన ప్రసన్నతలు లభిస్తాయని శుభవార్తను అందజేస్తారు.

6. విశ్వాసి ఆత్మ దేహాన్ని వీడి బయటికి వచ్చినప్పుడు భూమి మీద ఉండే అత్యంత మంచి కస్తూరి లాంటి సువాసన గుభాళిస్తుంది.

7. విశ్వాసి ఆత్మను పైకి తీసుకెళ్ళే దూతలు ఆకాశ ద్వారం వద్ద అతని గురించి పరిచయం చేయగానే అక్కడి భద్రతా దూతలు స్వాగతాలు పలుకుతూ ఆకాశ ద్వారం తెరుస్తారు.

8. విశ్వాసి ఆత్మ కోసం భూమ్యాకాశాల మధ్య ఉండే దైవదూతలందరూ కారుణ్య ప్రార్ధనలు చేస్తారు.

9. ప్రతి ఆకాశంలోనూ దైవదూతలు విశ్వాసి ఆత్మకు వీడ్కోలు పలకటం కోసం మరో ఆకాశం వరకూ వస్తారు.

10. ఏడో ఆకాశానికి చేరుకున్న తర్వాత అల్లాహ్ ఆజ్ఞ మేరకు ఆ ఆత్మ పేరు ఇల్లీయ్యీన్ ల జాబితాలో నమోదు చేయబడుతుంది. ఆ తర్వాత ఆత్మను తిరిగి సమాధిలోకి పపించటం జరుగుతుంది. 

మరణ సమయంలో అవిశ్వాసి పడే బాధలు 

మరణ సమయంలో అవిశ్వాసి పడే బాధలు 

ఎవరైతే నిజ దైవాన్ని తిరస్కరిస్తారో , తమ ఇష్టం వచ్చినట్లు జీవితాన్ని గడుపుతారో వారి మరణ సమయంలో అత్యంత తీవ్రమైన యాతనలకు  , బాధలకు గురికాబడుతారు.   

అవిశ్వాసి మరణ సమయంలో ఈ క్రింది పది రకాల శిక్షలు గాని, వాటిలో కొన్ని గాని ఉంటాయి.  

1. అవిశ్వాసి ప్రాణం తీయడానికి నల్లటి మొహాలతో అత్యంత భయంకరంగా ఉండే దైవదూతలు వస్తారు.

2. అవిశ్వాసి ప్రాణం తీసే దూతలు (ఆత్మను చుట్టుకొని తీసుకెళ్లటం కోసం) తమ వెంట  అత్యంత దుర్గంద భరితమైన గోనెసంచి తీసుకొని వస్తారు.

3. దైవ దూతలు అవిశ్వాసిని "ఓ అపవిత్రాత్మా! ఈ శరీరం నుంచి బయటికి రా ... దైవాగ్రహం వైపుకు రా" అని భయపెడుతూ అతని ప్రాణాన్ని యథానలకు గురిచేస్తూ అత్యంత వ్యధాభరితంగా ప్రాణం తీస్తారు .

4. అవిశ్వాసి ఆత్మను తీసేటప్పుడు దూతలు అతని మొహమ్మీద, వీపుమీద కొడుతూ అత్యంత వ్యధాభరితంగా ప్రాణం తీస్తారు, అతని ప్రతీ కీలు పై కొడుతూ, ముళ్ళ కంప పై వస్త్రాన్ని వేసి లాగినట్టుగా అతని ప్రాణాన్ని యథానలకు గురిచేస్తూ అత్యంత వ్యధాభరితంగా ప్రాణం తీస్తారు .  

5. అవిశ్వాసి ఆత్మను తీసేటప్పుడు దూతలు  భయంకర నరక అగ్నిశిక్ష 'శుభవార్త' కూడా ఇస్తారు.

6. చనిపోయేటప్పుడు అవిశ్వాసి ఆత్మనుంచి ఈ భూమి  అత్యంత దారుణంగా కుళ్ళిన మృతదేహం నుంచి ఎలాంటి దుర్వాసన అలాంటి వాసన వస్తుంది .

7. ఆ దుర్వాసన భరించలేక భూమ్యాకాశాలలో ఉన్న ఇంకా వాటి మధ్యలో ఉన్న దైవదూతలందరూ  శాపనార్ధాలు పెడతారు.

8. అవిశ్వాసి ఆత్మను శరీరం నుంచి బయటికి తీసిన తర్వాత దైవదూతలు దాన్ని మొదటి ఆకాశానికి (తీసుకెళ్ళి అక్కడి ద్వారపాలకులకు) పరిచయం చేసి ద్వారం తెరవమని అడుగుతారు. కాని అక్కడి ద్వారపాలకులు ద్వారం తెరవడానికి నిరాకరిస్తారు.

9. అల్లాహ్ ఆజ్ఞ మేరకు ఆ అవిశ్వాసి ఆత్మ సిజ్జీన్లో (నరక వాసుల జాబితా ) నమోదు చేయబడుతుంది.

10. సిజ్జీన్ లో నమోదు చేయటం అయిపోయిన తర్వాత అవిశ్వాసి ఆత్మను అత్యంత అవమానకరంగా మొదటి ఆకాశం నుంచి భూమిపైకి విసిరేయడం జరుగుతుంది.
11. ప్రళయం వరకు అతనికి సమాధిలో దైవ దూతలు భయంకరంగా శిక్షిస్తూ ఉంటారు . 

by 
IMP SAYEED
www.imp4u.org


ఖుర్'ఆన్ వెలుగులో సమాధి శిక్ష 

ఫిరౌన్ అనుచరులు సముద్రంలో మునిగి చచ్చిన తర్వాత నుంచి ప్రతిరోజు ఉదయం సాయంత్రం వారికి అగ్ని శిక్ష విధించబడుతుంది. 

"ఫిరౌన్ అనుచరులు ఒక భయంకరమైన శిక్షలో చిక్కుకున్నారు. వారు ఉదయం సాయంత్రం నరకాగ్ని ముందు ఉంచబడుతూ ఉంటారు. ప్రళయ ఘడియ వచ్చినప్పుడు ఫిరౌన్ ప్రజలను తీవ్రమైన సిక్షలోకి ప్రవేశింపజేయ్యండి అని ఆజ్ఞాపించబడుతుంది. (ఖుర్'ఆన్; 40:45)

అవిశ్వాసులకు మరణ సమయం నుంచే శిక్ష మొదలవుతుంది. 

" దుర్మార్గులు మరనవేదనలో మునిగి తేలుతూ ఉండగా దైవదూతలు  హస్తాలను చాచి ఇటు తెండి! బయటకు తెండి మీ ప్రాణాలను, అల్లాహ్ పై అపనిందను మోపి అన్యాయంగా కోసిన కూతలకు, ఆయన ఆయతుల పట్ల తలబిరుసు వైఖరి ప్రదర్శించినందుకు ఫలితంగా ఈ రోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది. అని అంటూ ఉండగా నీవు చూడగలిగితే ఎంత బాగుంటుంది! (ఖుర్'ఆన్; 6:93)

"దైవదూతలు ప్రపంచంలో తమ ఆత్మలకు అన్యాయం చేసుకుంటూ ఉన్నవారి ప్రాణాలు తీసినప్పుడు వారు (తల బిరుసుతనాన్ని విడిచిపెట్టి) వెంటనే పూర్తిగా లొంగిపోయి "మేము తప్పు చేసి ఉండలేదు" అని అంటారు. దానికి దూతలు 'ఎందుకు చేసి ఉండలేదు' అల్లాహ్ మీ చేష్టలను బాగా ఎరుగును. ఇక పొండి. నరకద్వారాలలో దూరిపొండి. అక్కడనే మీరు శాస్వతంగా ఉంటారు, అని అంటారు. కనుక యదార్ధం ఏమిటంటే గర్విష్టులకు లభించే నివాసం చాలా చెడ్డది." (ఖుర్'ఆన్ 16:28,29)

అవిస్వాసుల ఆత్మలు వసపరచుకోగానే దూతలు వారిని కొట్టటం ప్రారంభిస్తారు.      

"దైవదూతలు హతులైన అవిస్వాసుల ప్రాణాలు తీస్తున్నప్పటి స్థితిని నీవు గనక చూడగలిగితే ఎంత బాగుండేది! వారు వారి మొహాలపైని, పిరుదుల పైన కొట్టేవారు. ఇంకా ఇలా అనేవారు. ఇదుగో కాల్చే శిక్షను అనుభవించండి. (ఖుర్'ఆన్; 8:50)

ప్రజలు గనక సమాధి శిక్ష చూస్తే శవాలను పూడ్చి పెట్టడం మానేస్తారు. 

హజ్రత్ అనస్ (ర.జి) కధనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఇలా అన్నారు. "మీరు శవాలను పూడ్చిపెట్టడం మానేస్తారేమోనన్న భయం గనక లేకుంటే (సమాధి శిక్షకు సంబంధించిన శబ్దాలు) మేకు కూడా వినిపించమని నేను అల్లాహ్ ని ప్రార్ధించి ఉండేవాణ్ణి" (ముస్లిం)

ప్రజలు గనక సమాధి శిక్ష చూస్తే తక్కువగా నవ్వుతారు, ఎక్కువగా ఏడుస్తారు. భార్యలతో కలవడం కూడా మానేస్తారు. జనావాసాలు వదిలిపెట్టి అడవుల్లో, ఎడారుల్లో పోయి ఉంటారు.

సమాధిలో శిక్షలు వాటి రకాలు  

అవిశ్వాసి, కపటి మరియు పాపాత్ముడైన మనిషికి సమాధిలో ఈ క్రింద పేర్కొనబడిన పదిరకాల శిక్షలు లేక వాటిలో కొన్ని విధించబదతాయి.

1. సమాధిలో తీవ్ర భయాందోళనల శిక్ష

2. స్వర్గం కోల్పోయిన దుఃఖ శిక్ష

3. నరకపు విషపూరితమైన వేడి గాలి శిక్ష

4. నరకంలోని భయంకరమైన స్థాన దర్శన శిక్ష

5. అగ్ని పడక శిక్ష

6. అగ్ని వస్త్రాల శిక్ష

7. సమాధి గోడల మధ్య నలగడం

8. ఇనుప గడలతో కొత్తబడే శిక్ష

9. పాములు, తేళ్ళు కుట్టే శిక్ష

10. దుష్కర్మలు అత్యంత వికృత మనిషి రూపంలో వచ్చి భయపెట్టే శిక్ష.

కడుపు నొప్పితో చనిపోయినవాడు సమాధి ఉపద్రవం నుంచి సురక్షితంగా ఉంటాడు. 

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ యసార్ (ర.జి) కథనం నేను కూర్చొని ఉండగా సులైమాన్ బిన్ సర్ద్ (ర.జి) మరియు ఖాలిద్ బిన్ ఉర్ఫత్ (ర. జి) (అక్కడికి వచ్చారు) అక్కడున్న జనం ఫలానా మనిషి కడుపు నొప్పితో చనిపోయాడని చెపారు. అది విని వాళ్ళిద్దరూ తాము ఆ వ్యక్తి జనాజాలో పాల్గొంటే బాగుండేదని అన్నారు. తర్వాత వారిలో ఒకాయన ' ఎవరినైతే తన కడుపు మరణానికి గురిచేస్తుందో అతన్ని సమాధి శిక్షించడం జరగదు. అని దైవ ప్రవక్త (స.అ.సం) చెప్పలేదా? అని అడగ్గా, దానికి రెండో ఆయన "ఎందుకు చెప్పలేదు, చెప్పారు" అని చెప్పారు. (నసాయి; సహీహ్)

 గమనిక: యుద్ధ రంగంలో వీరమరణం పొందేవాడే గాకుండా ఉదర వ్యాధితో చనిపోయే షహీద్ గురించి కూడా దైవ ప్రవక్త (స.అ.సం) అతను సమాధి శిక్ష నుంచి సురక్షితంగా ఉంటాడని శుభవార్త ఇచ్చారు. కనుక షహీదుల్లోని ఇతర రకాల వారు కూడా సమాధి శిక్ష నుంచి సురక్షితంగా ఉంటారని పండితులు ఆశాభావం వ్యక్తం చేశారు. నిజం అల్లాహ్ కె బాగా తెలుసు. పొతే షహీల్లోని ఇతర రకాలవారు వీరు 1. పేగు వ్యాధితో చనిపోయినవాడు 2. ఉదర వ్యాధితో చనిపోయిన వాడు. 3. నీటి ముంపునకు గురై చనిపోయిన వాడు 4. గోడ క్రిందపడి చనిపోయిన వాడు (బుఖారి) 5. ప్రసవ వేదనతో చనిపోయే స్త్రీ 6. అగ్నిలో కాలి చనిపోయేవారు 7. ప్రక్కటెముక వ్యాధి (నిమోనియా) వచ్చి చనిపోయిన వాడు 8. తన ధర్మాన్ని రక్షించుకో బోయి చనిపోయిన వాడు 9. తన ఆలు బిడ్డల్ని రక్షించుకోబోయి చని పోయిన వాడు 10. ఆత్మరక్షణ కోసం ప్రయత్నిస్తూ చనిపోయిన వాడు 11. తన ధనాన్ని రక్షించుకోబోయి చని పోయిన వాడు 12. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతూ చనిపోయినవాడు 13. చిత్తశుద్ధితో వీర మరణాన్ని కోరుకునే వారు (ముస్లిం) 14. ఉదయం, సాయంత్రం హష్ర్ సూరాలోని మూడు సూక్తులు పఠిన్చేవారు (తిర్మిజి,దారిమి)

ఆత్మలు ప్రపంచానికి తిరిగి రావటం సాధ్యమేనా?

దైవ ప్రవక్త (స.అ.సం) గాని, వలీగాని, షహీద్ గాని మరణించిన తర్వాత వారి ఆత్మ తిరిగి ప్రపంచంలోనికి రావడం అసాధ్యం 

ఇంతలో పట్టణంలోని ఒక మారుమూల ప్రాంతం నుండి ఒక వ్యక్తి పరుగెత్తు కుంటూ వచ్చి ఇలా అన్నాడు: "నా జాతి ప్రజలారా! దైవప్రవక్తలను అనుసరించండి. మీ నుండి ఏ ప్రతిఫలమూ కోరనివారిని, సత్యమార్గంలో ఉన్నవారిని అనుసరించండి. ఎవరు నన్ను సృష్టించారో, ఎవరి వైపునకు మీరంతా మరలిపోనున్నారో, ఆయనను నేనెందుకు పూజించకూడదు? ఆయనను కాదని నేను ఇతరులను అరాధ్యులుగా చేసుకోవాలా? వాస్తవానికి ఒకవేళ కరుణామయుడైన దేవుడు నాకేదైనా నష్టం కలిగించ దలిస్తే నాకు వారి సిఫారసు ఏవిధంగానూ ఉపయోగపడదు, వారు నన్ను విడిపించనూలేరు. ఒకవేళ నేను అలా చేస్తే, స్పష్టమైన మార్గ భ్రష్టత్వానికి గురి ఔతాను. నేను నా ప్రభువును విశ్వసించాను. కనుక మీరు కూడా నా మాట వినండి. 

చివరకు వారు అతన్ని హత్య చేశారు. ఆ వ్యక్తితో "స్వర్గం లో ప్రవేశించు" అని అనబడింది. అతను ఇలా అన్నాడు. " నా ప్రభుఉ ఏ విషయాన్ని బట్టి నన్ను క్షమించి గౌరవనీయులలోకి ప్రవేశింపజేశాడో, నా జాతివారికి తెలిస్తే ఎంత బాగుండును" (ఖుర్'ఆన్; 36: 20-27)

ఈ పై ఆయతును బట్టి చూస్తే ఆత్మ ప్రపంచానికి రావడం అసాధ్యం అని తెలుస్తుంది. అలా సాధ్యమైతే నా జాతి వారికి తెలిస్తే ఎంత బాగుండును అని బాధ పడాల్సిన అవసరం ఉండేది కాదు.