Tuesday, September 13, 2022

ఇస్లాం చరిత్ర- 1

🕋☪🕋        ఇస్లాం చరిత్ర:- 1         🕋☪🕋☪


{....'ఇస్లాం చరిత్ర' మొదలుకొని 'హజ్రత్ ఈసా {అలైహి}' వరకు....}


{ఇస్లాం పరిచయం:-1}

అల్హందులిల్లాహ్ - సకల ప్రశంసలు మరియు కృతజ్ఞతలు అల్లాహ్ కే. మేము ఆయనను ప్రశంశిస్తాము, ఆయన సహాయాన్ని కోరతాము. మనలోని ప్రతి చెడు మరియు దుష్ట పనులనుండి ఆయన శరణు వేడుకుంటాము. అల్లాహ్ మార్గదర్శకత్వం చూపిన వారిని ఎవ్వరూ సన్మార్గం నుండి తప్పించలేరు మరియు అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో వదిలివేసిన వారికి మరెవ్వరూ దారిచూపలేరు. నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధ్యుడు లేడని మరియు నేను సాక్ష్యమిస్తున్నాను ము'హమ్మద్ ఆయన దాసుడు మరియు ప్రవక్త అని.


🔷🔷 ఇస్లాం అంటే ఏమిటి ? 🔷🔷


'ఇస్లాం' అనేది మతము కాదు. ఇది ఒక జీవనవిధానం. మానవాళి కోసం సృష్టికర్త అయిన దైవం పంపించినటువంటి ఒక సంపూర్ణమైనటువంటి జీవనవిధానం. నిజదేవుడు ఒక్కడే అని నమ్మి, ఆయనను మాత్రమే ఆరాధించడం అనేది ఇస్లాంలో అత్యంత ముఖ్యాంశం.


ఇస్లాం ధర్మం ఒక సహజమైన మరియు సంపూర్ణమైన జీవనవిధానం. సర్వలోకాల సృష్టికర్తతో మరియు ఆయన సృష్టితో తమసంబంధం ఎలా ఉండాలనే ముఖ్యాంశంపై తగిన సావధానత చూపాలని మనల్ని ప్రోత్సహిస్తున్నది. సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ ఆమోదించిన మంచిపనులు చేయడంలోనే ఆత్మలకు నిజమైన సంతోషం మరియు శాంతి లభిస్తుందని ఇస్లాం ధర్మం బోధిస్తున్నది. ఆ మంచిపనులు స్వంతానికీ మరియు సమాజానికీ ప్రయోజనకరమైనవై ఉంటాయి.


ఇస్లాం ధర్మంయొక్క ఔన్నత్యం ఏమిటంటే, ఒకవ్యక్తి ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత అతడు ఈ ప్రపంచంలో నుండి వెళ్ళిపోయేవరకు, ఏమిచెయ్యాలి, ఏమిచెయ్యకూడదు అనేటటువంటి ప్రతివిషయాన్ని క్షుణ్ణంగా చర్చించినటువంటి ధర్మము ఇస్లాం.


ఒకసారి మనం ప్రపంచంలో ఉండే మతాలను పరిశీలిస్తే, అందులో ప్రధానమైనటువంటి చాలా విషయాల ప్రస్తావన మనకు కనిపించదు. కానీ ఇస్లాంధర్మంలో, ఒకశిశువు పుట్టినప్పటి నుండి అతని నామకరణం ఎలాచెయ్యాలి, అతనికి ఎలాంటి విద్యను నేర్పించాలి, ఆ వ్యక్తికి ఎలాంటి సంస్కరణను నేర్పించాలి, ఆ వ్యక్తి వివాహం ఎలాచెయ్యాలి మరియు ఎలాంటి వ్యక్తితో చెయ్యాలి, చెడు విషయాల జోలికి పోకుండా జీవితాన్ని ఎలాగడపాలి, చివరకు ఆ వ్యక్తి మరణించిన తరువాత ఆ శవాన్ని ఖననం చేసేవరకూ ప్రతి విషయాన్నీ ఇస్లాం ధర్మం బోధించింది. ఒక్క మాటలో చెప్పాలంటే; ఒక మనిషి పుట్టుకనుండి మరణంవరకు ఏమిచెయ్యాలి, ఏమిచెయ్యకూడదు, ఎలా జీవితం గడపాలి అనేటటువంటి ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా చర్చించినటువంటి ధర్మం ఈ భూమండలంపై ఏదైనా ఉందంటే అదికేవలం ఇస్లాం మాత్రమే.


ఇస్లాం ధర్మం, మనిషి యొక్క వ్యక్తిగత, కౌటుంబిక, సామాజిక, రాజకీయ, ఆర్థిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో ఒక వ్యక్తి మార్గదర్శకం వహిస్తుంది.


ఇస్లాం ధర్మం, నైతిక విలువలను మరియు జీవన శైలిని సూచించే పేరు కలిగున్న ఒక సంపూర్ణ ఏకైకధర్మం.


ప్రపంచంలోని మతాలన్నింటినీ ఒకసారి పరిశీలించండి. క్రీస్తు ప్రవక్త అనుయాయులు తమ మతానికి తమ ప్రవక్త పేరే పెట్టుకున్నారు. సింధూ నదీ తీరాన ఆవిర్భవించిన మతం సింధూ లేక హిందూమతంగా ప్రఖ్యాతిగాంచింది. యూదుల్లోని ఒక ప్రత్యేక తెగ యహూదా మూలంగా యూద మతానికి ఆ పేరు వచ్చింది. గౌతమ బుద్ధుడు స్థాపించిన మతం బౌద్ధమతం అయింది. ఈ విధంగా ప్రపంచంలోని ఇతర మతాలన్నీ కూడా వాటిని స్థాపించినవారి పేర్లతోనో లేక అవి ఆవిర్భవించిన ప్రాంతం, తెగల పేర్లతోనో నామకరణం చేయబడ్డాయి. కాని ఇస్లాం మాత్రం వీటన్నింటికీ భిన్నంగా ఒక సహజమైన పదంతో నామకరణం చేయబడింది.


'ఇస్లాం' అనేటటువంటి పదము అరబీలోని 'సలాం' మరియు 'సిల్మ్' అనే రెండు మూలపదాల నుండి ఏర్పడింది. 


'సలాం' అంటే 'శాంతి' మరియు 'సిల్మ్' అంటే 'సమర్పణ' అని అర్థం.


ఎవరైతే తన ఇష్టాన్ని పక్కనపెట్టి దైవ ఇష్టానికై తనకు తాను సమర్పించుకోవడం ద్వారా శాంతిని పొందడాన్నే అరబీలో 'ఇస్లాం' అని అంటారు. ఈ విధానాన్ని పాటించేటటువంటి వ్యక్తిని అరబీలో 'ముస్లిం {దైవవిధేయుడు)' అని అంటారు.


💎 "నిస్సందేహంగా ఇస్లాం మాత్రమే అల్లాహ్‌ వద్ద సమ్మతమైన ధర్మం...." {ఖుర్ఆన్3:19}.


ఇస్లాం ధర్మం కొత్త ధర్మమేమీ కాదు. ప్రవక్తలందరూ, తమతమ కాలాల్లో, తమతమ జాతులకు బోధపరచిన ధర్మమే ఇది. కాకపోతే అంతిమ దైవప్రవక్త ము'హమ్మద్ {సల్లం} ద్వారా ఇది మానవాళికి సంపూర్ణంగా అందజేయబడింది. మహాప్రవక్త {సల్లం} తెలిపినట్లుగానే మనం ఈ ధర్మాన్ని పూర్తిగా నమ్మి నడుచుకోవాలి. తౌహీద్ {దేవుని ఏకత్వం}, రిసాలత్ {దైవదౌత్యం}, ఆఖిరత్ {పరలోకం}పై దృఢవిశ్వాసం కలిగి ఉండాలి. అల్లాహ్ ఒక్కడే అని కేవలం నమ్మినంతమాత్రాన లేక కొన్ని మంచిపనులు చేసుకున్నంత మాత్రాన మన జీవితంలో సంపూర్ణ ఇస్లాంరాదు. దానివల్ల పరలోక సాఫల్యం కూడా సిద్ధించదు. ఇస్లాం అన్నా, ఈమాన్ అన్నా, జీవనధర్మం అన్నా పూర్తిభావం ఏమిటంటే - అల్లాహ్ ఒక్కడేనని నమ్మాలి. కేవలం ఆయన్నే ఆరాధించాలి, ము'హమ్మద్ {సల్లం} సమేతంగా దైవప్రవక్తలందరినీ విశ్వసించాలి. మహాప్రవక్త ము'హమ్మద్ {సల్లం}తో దైవదౌత్యం పరిసమాప్తమయిందన్న విషయాన్ని మనసారా అంగీకరించాలి. ఈ విశ్వాసాలతో పాటు ఖుర్ఆన్ {మరియు} హదీసుల ప్రకారం సదాచరణలను శ్రద్ధగా అవలంబించాలి. ఇదే ఇస్లాం ధర్మం. ఈ ధర్మం తప్ప మరొక ధర్మం ఏదీ దైవసమక్షంలో స్వీకారయోగ్యం కాదు. ఈ మార్గాన్ని తప్ప మరోమార్గాన్ని అవలంబించినవాడు పరలోకంలో విఫలుడవుతాడు, నష్టపోతాడు.


💎 "ఎవరయినా ఇస్లాంను కాకుండా మరోధర్మాన్ని అన్వేషిస్తే అతనిధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయినవారిలో చేరిపోతాడు." {ఖుర్ఆన్ 3:85}.


ఇస్లాం ద్వారానే, అంటే సృష్టికర్త అయిన అల్లాహ్ కి విధేయత చూపడం ద్వారానే ఇహలోకంలోనూ మరియు మరణానంతరం పరలోకంలోనూ సాఫల్యం పొందవచ్చు.


అల్లాహ్ {సృష్టికర్త} అంటే ఎవరు ?:-


"అల్లాహ్" అంటే మానవుల ఆరాధ్యదైవం. అల్లాహ్ ఒక్కడే. ఆయన ఎవరి అవసరం లేనివాడు. ఆయనకు సంతానంలేరు. ఆయన కూడా ఎవరి సంతానమూ కాదు. ఆయనకు సరిసమానులు ఎవరూలేరు. విశ్వమంతటినీ సృష్టించింది ఆయనే. యావత్ ప్రపంచంపై ఆయన అధికారం ఉంది. ఆయన్ని ఎవరూ సృష్టించలేదు. ఆయన నిత్యం ఉంటాడు. సృష్టిరాశుల జీవన్మరణాలు ఆయన చేతిలోనే ఉన్నాయి. ఆయన చేయదలచుకున్న దానిని ఆపేవాడేవడూ లేడు. ఆయన ఆపదలచుకున్న దానిని చేసేవాడు కూడా ఎవడూలేడు.


ఆయన తినడు, త్రాగడు; ఆయనకు నిద్రలేదు, కునుకూరాదు. విశ్వవ్యవస్థను నడిపిస్తూ ఆయన అలసిపోడు. మనసుల్లో దాగిఉండే రహస్యాలు సైతం ఆయనకు తెలుసు. భూమ్యాకాశాలలో ఏదీ ఆయనకు గోప్యంగా లేదు. ఆయన జ్ఞానం విశ్వమంతా వ్యాపించిఉంది. ప్రతివిషయం ఆయనకు తెలుస్తూ ఉంటుంది.


🔰 అల్లాహ్ {సృష్టికర్త} గురించి In Sha Allah రేపటిభాగంలో మరింత వివరంగా తెలుసుకుందాం.



No comments:

Post a Comment