Tuesday, September 13, 2022

ఇస్లాం చరిత్ర 2

 ☪🕋☪🕋        ఇస్లాం చరిత్ర:-2         🕋☪🕋☪


~~~~~~~~~~~~~


{ఇస్లాం పరిచయం:-2}


                 అల్లాహ్ {సృష్టికర్త} అంటే ఎవరు ?:- 1


భూమిని, ఆకాశాలను, భూమ్యాకాశాల మధ్యఉన్న సమస్తాన్ని ఎవరైతే సృష్టించారో, ఎవరైతే సమస్తాన్ని పోషిస్తున్నారో, ఎవరైతే సమస్తానికి మరణాన్ని ఇస్తున్నారో, ఎవరైతే సమస్తజీవులను ప్రశ్నిస్తాడో, లెక్కతీసుకుంటాడో, ఆయననే అరబ్బి భాషలో "అల్లాహ్" అని పిలుస్తారు.


"అల్లాహ్" అంటే మానవుల ఆరాధ్యదైవం. అల్లాహ్ ఒక్కడే. ఆయన ఎవరి అవసరం లేనివాడు. ఆయనకు సంతానంలేరు. ఆయన కూడా ఎవరి సంతానమూ కాదు. ఆయనకు సరిసమానులు ఎవరూ లేరు. విశ్వమంతటినీ సృష్టించింది ఆయనే. యావత్ ప్రపంచంపై ఆయన అధికారం ఉంది. ఆయన్ని ఎవరూ సృష్టించలేదు. ఆయన నిత్యం ఉంటాడు. సృష్టిరాశుల జీవన్మరణాలు ఆయన చేతిలోనే ఉన్నాయి. ఆయన చేయదలచుకున్న దానిని ఆపేవాడేవడూ లేడు. ఆయన ఆపదలచుకున్న దానిని చేసేవాడు కూడా ఎవడూ లేడు.


     ఆయన తినడు, త్రాగడు; ఆయనకు నిద్రలేదు, కునుకూ రాదు. విశ్వవ్యవస్థను నడిపిస్తూ ఆయన అలసిపోడు. మనసుల్లో దాగిఉండే రహస్యాలు సైతం ఆయనకు తెలుసు. భూమ్యాకాశాలలో ఏదీ ఆయనకు గోప్యంగా లేదు. ఆయన జ్ఞానం విశ్వమంతా వ్యాపించిఉంది. ప్రతివిషయం ఆయనకు తెలుస్తూ ఉంటుంది.


     అల్లాహ్ భూమ్యాకాశాలకు మరియు సర్వానికి సృష్టికర్త. ఆయనే ఆరాధనీయుడు, ఆయనకు భాగస్వాములు, ప్రత్యర్థులు, సమానులు అంటూ ఎవరూలేరు. అల్లాహ్ తాను సృష్టించిన వాటిలా కాదు. ఆయన దైవత్వాన్ని దేనికీ ఆపాదించలేము. అంటే - సృష్టికర్త, పోషకుడు, కరుణామయుడు, సర్వశక్తిమంతుడు, న్యాయమూర్తి, సమస్తమూ తెలిసినవాడు.


     తన అధికారమూ, కార్యములరీత్యా అల్లాహ్ కు భాగస్వాములు లేరు. అల్లాహ్ ఆదేశం మేరకే జగత్తు సృష్టించబడింది. ఆయనే ఈ జగత్తులన్నింటినీ నడిపిస్తున్నదీ, నియంత్రిస్తున్నది. ఎంతో సమతుల్యమైన, సంక్లిష్టమైన ఈ సృష్టిని సృష్టించడమన్నది ఆ సర్వశక్తిమంతుడికి తప్ప మరొకరికి సాధ్యంకాదు.


     సుఖసంతోషాలు ఆయనే ఇస్తాడు. దుఃఖవిచారాలు ఆయనే కలిగిస్తాడు. మంచీచెడులు, లాభనష్టాలు అన్నీ ఆయన చేతుల్లోనే ఉన్నాయి. దైవత్వంలో, గుణగణాలలో, శక్తిసామర్థ్యాలలో ఆయనకు భాగస్వాములు ఎవరూలేరు. ఖుర్ఆన్ మాటల్లో చెప్పుకోవాలంటే: {ఖుర్ఆన్ ఆయత్ యొక్క తెలుగు భావానువాదం}:


💎 ".... ఆయన్ని పోలిన వస్తువేదీ లేదు...." {ఖుర్ఆన్ 42:11}.


అల్లాహ్ అంటే, ఆరాధనలకు అర్హుడు, నిజ ఆరాధ్యుడు అని అర్థం. కాని, అల్లాహ్ అంటే, దర్గాలు {సమాధులు}గానీ, పీర్లు గానీ, బాబాలు గానీ మనుష్యుల లేదా జంతువుల ప్రతిరూపాలు గానీ కాదు. వీటిని ఆరాధించటం ఖుర్ఆన్ గ్రంథం ప్రకారం అతిపెద్ద పాపం. దివ్య ఖుర్ఆన్ 30:40 వాక్యం ప్రకారం {ఖుర్ఆన్ ఆయత్ యొక్క తెలుగు భావానువాదం}:


"ఆ అల్లాహ్‌యే మిమ్మల్ని సృష్టించాడు, తర్వాత మీకు ఉపాధిని సమకూర్చాడు, మరి ఆయనే మిమ్మల్ని చంపుతాడు, ఆ తరువాత మిమ్మల్ని బ్రతికిస్తాడు. చెప్పండి ! ఈ పనులలో దేన్నయినా చేయగలవాడు మీరు కల్పించే భాగస్వాములలో ఎవడయినా ఉన్నాడా ? వారు కల్పించే భాగస్వామ్యాల నుండి అల్లాహ్‌ ఎంతో పవిత్రుడు, ఉన్నతుడు." {ఖుర్ఆన్ 30:40}.


🌎☄ సృష్టికర్త {అల్లాహ్} ఎలా ఉంటాడు ? మనిషికి ఉన్న బలాలు, బలహీనతలు సృష్టికర్తకు కూడా ఉంటాయా ? ☄🌎


ఆ సృష్టికర్త యొక్క లక్షణాలను గురించి దివ్య ఖుర్ఆన్ బోధనలు: ↓


🔸 అల్లాహ్ {సృష్టికర్త} యొక్క లక్షణాలు:-


అల్లాహ్ లక్షణాలపై ఖుర్ఆన్ లోని కొన్ని ఆయత్ ల భావాలు ఇక్కడ పొందుపరచడం జరుగుతోంది.


✳ పుట్టించేవాడే కాని పుట్టేవాడు కాదు. {ఖుర్ఆన్ 112:3}.


✳ మరణం ఇచ్చేవాడేకాని మరణం లేనివాడు. {ఖుర్ఆన్ 25:58}.


✳ నిదురను ఇచ్చేవాడు, నిద్రించనివాడు. {ఖుర్ఆన్ 2:255}.


✳ ఆకలిని తీర్చేవాడు, ఆహారం అవసరం లేనివాడు. {ఖుర్ఆన్ 51:57}.


✳ సంతానం ఇచ్చేవాడు, సంతానం లేనివాడు. {ఖుర్ఆన్ 112:3,42:49}.


✳ మనల్ని చూసేవాడు, మనకు కనబడనివాడు. {ఖుర్ఆన్ 6:103}.


✳ అలసిపోనివాడు. {ఖుర్ఆన్ 50:38}.


✳ భూమ్యాకాశాలకు వెలుగైనవాడు. {ఖుర్ఆన్ 24:35}.


✳ సృష్టి నాశనం అవుతుంది. తాను నాశనంలేని వాడు. {ఖుర్ఆన్ 55:26}.


✳ సృష్టిలో ఏ వస్తువుతో పోలిక లేనివాడు. {ఖుర్ఆన్ 42:11}.


✳ అవసరాలు తీర్చేవాడు, అవసరాలు లేనివాడు. {ఖుర్ఆన్ 112:2}.


✳ మొదటివాడు, ఆఖరివాడు. {ఖుర్ఆన్ 57:3}.


✳ మారనివాడు, స్థిరంగా ఉండేవాడు. {ఖుర్ఆన్ 2:255}.


✴ ఆయన ఒక్కడే {అద్వితీయుడు}. {ఖుర్ఆన్ 112:1}.


✴ ఆయనకు ఆది, అంతం, పుట్టుక, మరణము,లేదు. {ఖుర్ఆన్ 112:3;28:88}.


✴ ఆయనకు తల్లిదండ్రులు, భార్యాపిల్లలు ఉండరు. {ఖుర్ఆన్ 6:101; 112:3}.


✴ ఆయనకు సరిసమానులు, సాటి, మేటి ఎవ్వరూ లేరు. {ఖుర్ఆన్ 112:4}.


✴ ఆయనకు ఎటువంటి ప్రతిమ లేదు. ఆయనను పోలినది ఈ సృష్టిలో ఏదీలేదు. {ఖుర్ఆన్ 42:11}.


✴ ఆయనకు ఆకలిదప్పులు, నిద్ర అలసట లాంటి బలహీనతలు ఉండవు. ఆయన దేనిపైన ఆధారపడేవాడు కాదు. {ఖుర్ఆన్ 2:255;112:2}.


✴ ఆయన ఏదైనా చేయాలనుకుంటే కేవలం 'అయిపో' అని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే అది అయిపోతుంది. {ఖుర్ఆన్ 2:117}.


✴ ఆయన భూమిపైన {మానవరూపంలో} అవతరించడు. దైవదూతలను సందేశ నిమిత్తం అవతరింపజేస్తాడు. {ఖుర్ఆన్ 97:4}.


✴ ఆయన సప్తాకాశాలకు పైన సృష్టి సామ్రాజ్యపీఠము {అర్ష్}ను అధిష్టించి ఉంటాడు. {ఖుర్ఆన్ 20:5}.


ఈ లక్షణాలు గలవాడిని మనం మన ఆరాధ్యదైవంగా చేసుకోవాలి. ఈరోజు మనిషి ఆ సృష్టికర్తను విడిచిపెట్టి ఎవరినైతే ఆరాధిస్తున్నాడో, పూజిస్తున్నాడో వారు కూడా మనలాంటి మానవులే. మనకున్న శరీరం, ఆకలి దప్పికలు, నిదుర కునుకులు, మల మూత్ర విసర్జనలు వారికీ ఉన్నాయి. ఆ సృష్టికర్త మనలాంటి బలహీనతలు, లోపాలు కలిగినవాడుకాదు. మానవాతీతమైన లక్షణాలు కలిగినవాడు.


🔸 'అల్లాహ్' అనే పదానికి అర్థం ఏమిటి ?:-


విశ్వప్రభువుకు అన్నివిధాలా శోభాయమానమైన పదం "అల్లాహ్"


"అల్లాహ్" అనేది అరబీ భాషాపదం. ఇది "అల్" మరియు "ఇలాహ్" అనే రెండు పదాలు కలిసి ఏర్పడింది.


'అల్' అనేది ఇంగ్లీషులో వాడబడే THE వంటి ఉపపదం - ఆర్టికల్. దీని అర్థం నిర్దిష్టమైన, నిర్ణీతమైన, ప్రత్యేకమైన, ఇంతకు ముందు ప్రస్తావించబడిన, ఏకైక మరియు వాస్తవమైన అని.


'ఇలాహ్' అంటే ఆరాధింపబడేవాడు, ఆరాధ్యుడు, పూజితుడు, పూజింపబడేవాడు అని మొదలగు అర్థాలు వస్తాయి.


అల్ {The} + ఇలాహ్ {God} = అల్లాహ్ {The God}


ఇప్పుడు ఈ రెండు పదాలను {అల్+ఇలాహ్}ను కలిపితే "అల్లాహ్" అనే పదం ఏర్పడింది. అదే విధంగా దాని ప్రత్యేక అర్థం కూడ ఉనికిలోకి వచ్చింది. అనగా నిజ ఆరాధ్యుడు, ఏకైక ఆరాధ్యుడు, సాటిలేని ఆరాధ్యుడు, అసలైన ఆరాధ్యుడు, అందరికి తెలిసిన ఆరాధ్యుడు.


     ఇస్లాం దృష్టిలో సర్వలోకాల సృష్టికర్త మాత్రమే ఆరాధనలకు అర్హుడు. మిగతా జీవరాశులు, ఇతర సృష్టిరాశులు ఆరాధనలకు అనర్హమైనవి. ఎందుకంటే అవి కూడా తమ సృష్టికర్త ద్వారా ఉనికిలోకి వచ్చినవే. అవన్నీ అల్లాహ్ ఆజ్ఞ మేరకు తమ కాలం వెల్లబుచ్చుతున్నవి మాత్రమే. అంతిమ లక్ష్యంవైపు పయనిస్తున్నవి మాత్రమే.


తెలుగులో మనం 'దేవుడు' అంటాం. అరబీలో "అల్లాహ్" అంటారు. ఇంగ్లీషులో 'గాడ్ {God}' అని అంటారు. ఇలా మానవుల ఆరాధ్యదైవాన్ని ఒక్కో భాషలో ఒక్కో పేరుతో పిలుస్తుండవచ్చు. కాని ఇన్ని పదాల్లోకెల్లా "అల్లాహ్" అనేది ఎంతో విలక్షణమైన పదం. విశ్వప్రభువుకు అది అన్నివిధాలా శోభాయమానమైన పదం.


'దేవుడు' అనే పదం బహువచనమైతే 'దేవుళ్ళు' అయిపోతుంది. స్త్రీలింగమయితే 'దేవత' అవుతుంది. అలాగే ఇంగ్లీషులో కూడా God అనే పదం gods మరియు goddess అవటానికి ఆస్కారముంది. అలాగే ఆ పదం స్త్రీ పురుష భేదాన్ని సూచించేటట్టుగా కూడా ఉండరాదు. అరబీ భాషలోని అల్లాహ్ అనే పదం అచ్చు ఆ భావానికి దర్పణం పడుతుంది. అల్లాహ్ అనే పదానికి బహువచనం లేదు. అలాగే దీనికి స్త్రీ లింగ పదం కూడా రాదు. కనుక "అల్లాహ్" అనే పదం విశ్వప్రభువుకు అన్నివిధాలా శోభాయమైనదని చెప్పవచ్చు.


అరబ్బీ మాట్లాడే క్రైస్తవులు మరియు యూదులు "దేవుడు" అనే పదానికి  బదులుగా "అల్లాహ్" అనే పదాన్ని వాడుతారు. ఇంగ్లిష్ Bible లో God అని వాడిన చోటల్లా అరబిక్ Bible లో "అల్లాహ్" అనే పదం కనపడుతుంది.


🔸 ఒక అపోహ:-


ముస్లిమేతరులకు ఇస్లాం గురించి వున్న అనేక పెద్ద అపోహల్లో "అల్లాహ్" అనే పదానికి సంబంధించిన అపోహ కూడా ఒకటి. క్రైస్తవుల, యూదుల దేవుణ్ణి కాకుండా వేరెవరో దేవుణ్ణి ముస్లింలు ఆరాధిస్తారని చాలామంది అనుకుంటారు. కాని నిజానికి ఇదంతా ఓ అపోహ మాత్రమే. ఎందుకంటే "అల్లాహ్" అనే పదం దేవుడు అనే పదానికి పర్యాయపదం. దేవుడు అందరికీ ఒక్కడే.


దేవుడు ఎవరు ? ఆయన అస్తిత్వం ఏమిటి ? అనే విషయాల్లో యూదులు - క్రైస్తవులు - ముస్లింల మధ్య భేదాభిప్రాయాలున్నాయి. ఉదా:- క్రైస్తవుల్లో ఉన్న త్రిత్వభావన {Trinity}ను యూదులు తిరస్కరిస్తారు. ముస్లింలు కూడా దాన్ని తిరస్కరిస్తారు. అంత మాత్రం చేత ఆ మూడు మతాలకు వేర్వేరు దేవుళ్ళు ఉన్నారని అర్థంకాదు. ఎందుకంటే - విశ్వమంతటికి నిజదేవుడు ఒక్కడే. ఇస్లాం చెప్పేది ఏమిటంటే - ఇతర మతాలవాళ్ళు కూడా అల్లాహ్ నే విశ్వసిస్తున్నారు. కాని అల్లాహ్ ను ఏ విధంగా విశ్వసించాలో ఆ విధంగా విశ్వసించటం లేదు. దేవుడు ఫలానా విధంగా ఉంటాడని స్వయంగా కల్పనలు చేసుకొని విశ్వసిస్తున్నారు.


🔸 అల్లాహ్ ముస్లింల దేవుడు మాత్రమే కాదు:-


అల్లాహ్ అంటే ముస్లిముల దైవం, ఇంకో పేరున మరోజాతి వారి దైవం అని జనం చెప్పుకుంటూ ఉంటారు. ఇది కూడా పొరపాటే. ఇస్లాం సర్వమానవాళిని ఒకే తల్లిదండ్రుల సంతానంగా పరిగణిస్తుంది. వారందరి దైవం కూడా ఒక్కడే. ఆ దైవం మరియు ఆరాధ్యుని వివరణ మరియు విశ్లేషణ దివ్య ఖుర్ఆన్ లో ఇలా ఉన్నది: {ఖుర్ఆన్ ఆయత్ యొక్క తెలుగు భావానువాదం}:


💎 "{ఓ ము'హమ్మద్‌ - స !} వారికి ఇలాచెప్పు: ఆయన అల్లాహ్‌ {నిజమైన ఆరాధ్యుడు} ఒక్కడు. అల్లాహ్‌ నిరుపేక్షాపరుడు. {ఏ అక్కరా లేనివాడు}. ఆయన {ఎవరినీ} కనలేదు. ఆయన {కూడా} ఎవరికీ పుట్టినవాడు కాడు. ఆయనకు సరిసమానుడు {పోల్చదగినవాడు} ఎవడూ లేడు." {ఖుర్ఆన్ 112:1-4}.


నీ ప్రభువు పుట్టుపూర్వోత్తరాలను, ఆయన వంశ పరంపరను గురించి కాస్త వివరించమని బహుదైవారాధకులు మహాప్రవక్త {సల్లల్లాహు అలైహి వసల్లం}ను డిమాండు చేసిన నేపథ్యంలో ఈ ఖుర్ఆన్ అధ్యాయం అవతరించింది.


అల్లాహ్ నిజమైన ఆరాధ్యుడు ఒక్కడు. ఆయనకు ఎవరి అవసరమూ లేదూ. ఆయన ఎవరిపైనా ఆధారపడినవాడు కాడు. అందరికీ ఆయన అవసరం ఉంది. అందరూ ఆయన పైనే ఆధారపడి ఉన్నారు. అల్లాహ్ అందరికన్నా వేరైనవాడు, నిరపేక్షాపరుడు. ఆయనకు సంతానం లేదు. ఆయనకు తల్లిదండ్రులు సైతం లేరు. ఆయన ఎవ్వరినీ కూడా కుమారులుగా గాని, కుమార్తెలుగా గాని చేసుకోలేదు. ఆయన ఉనికిలోగాని, ఆయన గుణగణాలలో గానీ, ఆయన అధికారాలలో గానీ ఆయనకు భాగస్వాములు లేరు. ఆయనకు సరిజోడీ కూడా లేరు. {ఖుర్ఆన్ ఆయత్ యొక్క తెలుగు భావానువాదం}:


💎 ".... ఆయన్ని పోలిన వస్తువేదీ లేదు...." {ఖుర్ఆన్ 42:11}.


🔸 ఒక హదీస్ ఖుద్సీలో అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు:


"మానవుడు నన్ను దూషిస్తున్నాడు. అంటే నాకు సంతానాన్ని ఆపాదిస్తున్నాడు. వాస్తవానికి నేను ఒక్కడినే. నేను నిరుపేక్షాపరుణ్ణి. నేనెవరినీ కనలేదు. నేనెవరికీ పుట్టనూలేదు. నాకు సరిజోడీ కూడా ఎవరూలేరు."


ఈ విధంగా బహుధైవారాధకుల మూఢనమ్మకాలు, అల్లాహ్ కు కుమారులను ఆపాదించే వారి మిథ్యావాదాలు, దైవానికి భాగస్వాములను కల్పించేవారి యొక్క కల్పనిక సిద్ధాంతాలు అన్నీ నిర్ద్వంద్వంగా ఖండించబడ్డాయి.


అల్లాహ్ ను పోలిన ప్రతిమ లేదు, కాని ఆయనకు రూపం లేదు అని చెప్పడం తప్పు. ఖుర్ఆన్ ప్రకారం అల్లాహ్ కు రూపం ఉంది. కానీ, ఆయన ఎలా ఉన్నాడో ఈ సృష్టిలో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి ఆయనకు రూపాన్ని కల్పించడం తప్పు. స్వర్గంలో మాత్రమే అల్లాహ్ ను కళ్ళారా చూసే అదృష్టం {అవకాశం} లభిస్తుంది.


                 అల్లాహ్ {సృష్టికర్త} అంటే ఎవరు ?:- 2


🔰 InSha Allah రేపటిభాగంలో....;


అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు

No comments:

Post a Comment