Tuesday, September 13, 2022

ఇస్లాం చరిత్ర 3

 ఇస్లాం చరిత్ర:-3         🕋☪🕋☪


~~~~~~~~~~~~~


{ఇస్లాం పరిచయం:-3}


                 అల్లాహ్ {సృష్టికర్త} అంటే ఎవరు ?:- 2


🔸 'అల్లాహ్' అనే పదానికి అర్థం ఏమిటి ?:-


'అల్లాహ్' అనే అరబీ పదానికి 'సకల ఆరాధనలకు అర్హుడైన దైవం' అని అర్థం. అల్లాహ్ అనే పదాన్ని అలాగే వాడడానికి వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. అవి ఏమిటంటే, అల్లాహ్ అనే పదం భాషాపరంగా ఎంతో విశిష్టమైనది. ఎలాగంటే, ఈ పదానికి అరబీ భాషలో బహువచనం లేదు. దేవుడు అనే పదానికి బహువచనం {దేవుళ్ళు} అని ఉంది. కాని అల్లాహ్ అనే పదానికి బహువచనం లేదు. దేవుడు ఒక్కడే అయినప్పుడు ఆ పదానికి బహువచనం ఉండటం అర్థరహితం. ఇంకా అల్లాహ్ అనే పదానికి లింగం కూడా లేదు. దేవుడు అనే పదానికి స్త్రీ లింగం {దేవి, దేవత} ఉంది. కాని అల్లాహ్ అనే పదం అసలు ఏ లింగమూ కలిగిలేదు. అరబీ వ్యాకరణ నియామాలననుసరించి అల్లాహ్ ను 'అతడు' అని పుల్లింగంలో సంబోధిస్తాము. కాని అసలు ఈ పదానికి లింగం లేదని గుర్తించాలి. ఎందుకంటే స్త్రీ, పురుష లింగాలు సృష్టికి సంబంధించినవి మరియు జంతువులు, మానవులకు వర్తించేవి. సృష్టికర్త మనలాంటి ప్రాణి కాడు. ఆయన లింగానికి అతీతుడు.


ఇలా దైవ అస్తిత్వానికి సూటిగా సరిపోయే పదం 'అల్లాహ్'. ఇంకా చిట్టచివరి దైవసందేశ గ్రంథమయిన ఖుర్ఆన్ లో ఆ దైవం తనను తాను 'అల్లాహ్' అని పరిచయం చేసుకుంటున్నాడు. కాబట్టి ఆయనను అదే పేరుతో పిలవడం సమంజసం. ఇంకా ఖుర్ఆన్ లో పేర్గొనబడిన ఆయన ఇతర గుణనామాలు కూడా వాడవచ్చు. {ఖుర్ఆన్ ఆయత్ యొక్క తెలుగు భావానువాదం}:


💎 "వారికి చెప్పు: ''అల్లాహ్‌ను అల్లాహ్‌ అని పిలిచినా, రహ్మాన్‌ అని పిలిచినా - ఏ పేరుతో పిలిచినా - మంచి పేర్లన్నీ ఆయనవే. నువ్వు నీ నమాజును మరీ బిగ్గరగానూ, మరీ మెల్లగానూ పఠించకు. వీటికి నడుమ మధ్యేమార్గాన్ని అవలంబించు." {ఖుర్ఆన్ 17:110}.


🔸 అల్లాహ్ {సృష్టికర్త}కు రూపం ఉందా ?:-


ఉంది. కాని అది మనం ఊహించలేము, ఈ శరీరంతో దానిని వీక్షించలేము.  ఎందుకంటే ఆయనను సృష్టిలోని ఏ వస్తువుతో కూడా పోల్చలేము, సమానం చెయ్యలేము. {ఖుర్ఆన్ ఆయత్ ల యొక్క తెలుగు భావానువాదం}:


💎 ".... ఆయన్ని పోలిన వస్తువేదీ లేదు...." {ఖుర్ఆన్ 42:11}.


💎 "{ఓ ము'హమ్మద్‌ - స !} వారికి ఇలా చెప్పు: ఆయన అల్లాహ్‌ {నిజమైన ఆరాధ్యుడు} ఒక్కడు. అల్లాహ్‌ నిరుపేక్షాపరుడు. {ఏ అక్కరా లేనివాడు}. ఆయన {ఎవరినీ} కనలేదు. ఆయన {కూడా} ఎవరికీ పుట్టినవాడు కాడు. ఆయనకు సరిసమానుడు {పోల్చదగినవాడు} ఎవడూ లేడు." {ఖుర్ఆన్ 112:1-4}.


💎 "ఎవరి చూపులు కూడా ఆయన్ని అందుకోజాలవు. ఆయన మాత్రం అందరి చూపులను అందుకోగలడు. ఆయన సూక్ష్మదృష్టి కలవాడు. సర్వమూ తెలిసినవాడు." {ఖుర్ఆన్ 6:103}.


💎 "మేము నిర్థారించిన సమయానికి మూసా {అలైహిస్సలాం} వచ్చి, అతని ప్రభువు అతనితో సంభాషించిన తర్వాత అతను, ''నా ప్రభూ ! నాకు నీ దర్శనం కలిగించు. నేను ఓసారి నిన్ను చూస్తాను'' అని విన్నవించుకోగా, ''ఎట్టి పరిస్థితిలోనూ నువ్వు నన్ను చూడలేవు. అయితే అదిగో ! ఆ కొండ వైపు దృష్టిని సారించు. అది గనక యధాస్థితిలో ఉండగలిగితే నువ్వు కూడా నన్ను చూడగలుగుతావు'' అని ఆయన సెలవిచ్చాడు. ఆ తరువాత అతని ప్రభువు తేజస్సు ఆ కొండపై ప్రసరించగానే ఆ తేజస్సు దాన్ని తుత్తునియలు చేసేసింది. మూసా స్పృహతప్పి పడిపోయాడు. స్పృహలోకి రాగానే, ''{ప్రభూ !} నీవు పరమ పవిత్రుడవు. నేను నీ సన్నిధిలో పశ్చాత్తాపపడుతున్నాను. అందరికన్నా ముందు నేనే నిన్ను విశ్వసిస్తున్నాను'' అని మనవి చేసుకున్నాడు." {ఖుర్ఆన్ 7:143}.


సూర్యుడినే కొన్ని క్షణాలపాటు చూడలేని కళ్ళతో మనం ఈ విశ్వ సృష్టికర్తనే చూడాలనుకోవడం అవివేకం, అతనికి తగని రూపాన్ని అతనికి ఆపాదించడం అజ్ఞానం. అందుకనే మస్జిదులో ఆయన యొక్క ఏ చిత్ర పటమూ, విగ్రహమూ ఉండవు. 


అయితే పరలోక జీవితంలో సాఫల్యం పొందిన వారికి ఆయన దర్శనభాగ్యం లభించనుందని అల్లాహ్‌ తెలియపరిచారు. అక్కడ మనకు ఇవ్వబడే శరీరాలు వేరుగా ఉంటాయి. {ఖుర్ఆన్ ఆయత్ యొక్క తెలుగు భావానువాదం}:


💎 "మేమే మీ మధ్య చావును నియమించాము. ఈ విషయంలో మేము అశక్తులము కాము. మీ స్థానంలో మీ వంటి వారిని తీసుకువచ్చే, మీరెరుగని అవస్థలో మిమ్మల్ని తిరిగి లేపే శక్తి మాకుంది." {ఖుర్ఆన్ 56:60,61}.


అందుకని ఆయన రూపాన్ని దర్శించాలనే తపన కలవారు ఆయన తెలియజేసిన మార్గంలో పయనించాలి. ఎందుకంటే పరలోకంలో సాఫల్యం చెందేవారికే ఆ మహాభాగ్యం లభించనుంది. {ఖుర్ఆన్ ఆయత్ ల యొక్క తెలుగు భావానువాదం}:


💎 "ఆ రోజు ఎన్నో ముఖాలు {ఆహ్లాదకరంగా} తాజాగా ఉంటాయి. తమ ప్రభువు వైపు చూస్తూ ఉంటాయి." {ఖుర్ఆన్ 75:22,23}.


💎 "ఇలాంటి వారే తమ ప్రభువు తరఫు నుంచి వచ్చిన సన్మార్గాన ఉన్నారు. సాఫల్యాన్ని పొందేవారు వీరే." {ఖుర్ఆన్ 2:5}.


🔸 అల్లాహ్ ను మాత్రమే ఎందుకు ఆరాధించాలి ?:-


ఎందుకంటే అల్లాహ్ భూమి, ఆకాశాల సృష్టికర్త. సకల జీవుల ప్రభువు. అంటే వాటి సృష్టికర్త {Creator}, అధిపతి {Owner} మరియు పోషణకర్త {Cherisher or Sustainer}. తీర్పు దినానికి యజమాని. ఆయనే మనందరినీ సృష్టించి, పోషిస్తున్నాడు మరియు మరణం తరువాత మనందరమూ తీర్పు కోసం ఆయన ముందు నిలవనున్నాము. అందుకని సకల ఆరాధనలకు అర్హత కేవలం ఆ ఒక్క అల్లాహ్ కు మాత్రమే ఉంది.


🔸 మరి ఆయనను ఇక్కడ ఎలా ఆరాధించాలి ? రూపం తెలియకుంటే ఏకాగ్రత ఎలా సాధ్యం ?:-


ఆయనను ఆయన దైవప్రవక్తలు {ము'హమ్మద్, ఈసా, ఇబ్రాహీం మొదలైన మహాప్రవక్తలు - వారందరిపై దైవం యొక్క శాంతి, శుభాలు కురుయుగాక} ఎలా ఆరాధించి చూపారో అలానే నమాజు ద్వారా ఆరాధించడం జరుగుతుంది. 


కష్టాలలో ఉన్నప్పుడు, ఏ విగ్రహమూ, బొమ్మ గురించి ఆలోచించము, దేవుడా రక్షించు అంటాము. అప్పుడు అవసరంలేని విగ్రహం ఇప్పుడెందుకు ? దేవుడి గుణగణాలను, అనుగ్రహాలను లేదా కరుణా కటాక్షాలను మననం చేసుకుంటూ మరియు ఖుర్ఆన్ వాక్యాల అర్థం మీద మనసు కేంద్రీకృతం చేస్తే చాలు ఏకాగ్రత, మనో నిర్మలత వాటంతట అవే వస్తాయి. {ఖుర్ఆన్ ఆయత్ యొక్క తెలుగు భావానువాదం}:


💎 "మరి వారు ఓడలో ప్రయాణమైనప్పుడు, తమ ఆరాధనను అల్లాహ్‌కే ప్రత్యేకించుకుని - కేవలం ఆయన్నే మొరపెట్టుకుంటారు. తరువాత ఆయన వారిని సురక్షితంగా తీరానికి చేర్చగానే, అప్పటికప్పుడే వారు దైవానికి సహవర్తుల్ని కల్పించటం మొదలెడతారు." {ఖుర్ఆన్ 29:65}.


చెట్లు, చేమలు, నదులు, సూర్యచంద్రులు, గ్రహాలు, నక్షత్రాలు, జంతువులు, విగ్రహాలు, పుణ్యపురుషులు, బాబాలు, దైవప్రవక్తలు, పౌరాణిక గాధలలోని పాత్రలు మొదలైనవన్నీ సృష్టితాలే, ఇవేమీ సృష్టికర్తకు సమానం కావు. ఎంత గొప్ప మనిషైనా దేవుడితో సమానం కాడు, సృష్టిలోని అంశమే. దేవుడు మనిషి కాజాలడు. దేవుడు దేవుడే, మనిషి మనిషే.


అల్లాహ్ అంటే ముస్లిముల లేదా అరబ్బుల దేవుడు అని ఒక అపోహ ఉంది. ఇక్కడ ప్రస్తావించబడుతోంది ఒక వర్గం వారి దేవుడి గురించి కాదు. భూమ్యాకాశాలను, సమస్త మానవాళిని, జంతు జీవాలనూ సృష్టించినవాడు ఒక్కడే. ఒకొక్క జాతికి, దేశానికి ఒకొక్క దేవుడు లేడు, సమస్త మానవాళి దైవం ఒక్కడే. ఆ దైవానికి మనం అతడి ఆజ్ఞలకు వ్యతిరేకంగా అనేక రూపాలు, అస్తిత్వాలు కల్పించుకొని అజ్ఞానంతో మతాలుగా విడిపోయి విభేదాలలో పడిపోయాము. దైవానికి అనేక రూపాలను కల్పించుకోవడాన్ని దైవం తరపునుండి ఏ ప్రమాణం లేకున్నా, మానవ కల్పిత సిద్ధాంతాల ద్వారా సమర్ధించుకుంటున్నాము. ఈ అంధకారం నుంచి బయటపడి, దైవాన్ని గుర్తించవలసిన రీతిలో గుర్తించి ఏకేశ్వరోపాసన ద్వారా మాత్రమే మానవాళి ఐక్యత, సమానత్వం, శాంతి సాధ్యమౌతాయి. అందుకని ఇక్కడ ఎవరి దేవుడు గొప్ప అనేది చర్చ కాదు, కల్పిత దైవాల ద్వారా దేవుడి గొప్పదనాన్ని ఎలా కూలగొడుతున్నామో అనేది ఆలోచించుకోవాలి.


సృష్టిని కాదు సృష్టికర్తనే ఆరాధించండి., ఇదియే మోక్షమార్గం. {ఖుర్ఆన్ ఆయత్ ల యొక్క తెలుగు భావానువాదం}:


💎 "ధర్మం విషయంలో బలవంతం ఏమీ లేదు. సన్మార్గం అపమార్గం నుంచి ప్రస్ఫుటమయ్యింది. కనుక ఎవరయితే అల్లాహ్ తప్ప వేరితర ఆరాధ్యులను {తాగూత్ ను} తిరస్కరించి అల్లాహ్ ను మాత్రమే విశ్వసిస్తారో వారు దృఢమైన కడియాన్ని పట్టుకున్నారు. అది ఎన్నటికీ తెగదు. అల్లాహ్ సర్వంవినేవాడు, సర్వంతెలిసినవాడు." {ఖుర్ఆన్ 2:256}.


💎 "నిస్సందేహంగా ఇస్లాం మాత్రమే అల్లాహ్‌ వద్ద సమ్మతమైన ధర్మం...." {ఖుర్ఆన్ 3:19}.


💎 "ఎవరయినా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయినవారిలో చేరిపోతాడు." {ఖుర్ఆన్ 3:85}.


తన సృష్టికర్తను విశ్వసించే స్వాభావిక విశ్వాసంతో ప్రతిమానవుడు సృష్టించబడతాడు. దీని గురించి అతడు ముందుగా ఆలోచించవలసిన అవసరం లేక నేర్చుకోవలసిన అవసరం లేదు. మార్గభ్రష్టత్వంలో పడిపోయినవారు తప్ప, మరెవ్వరూ ఈ సహజసిద్ధమైన దైవవిశ్వాసం నుండి మరలిపోరు. దీని గురించి ప్రవక్త ము'హమ్మద్ {సల్లల్లాహు అలైహి వసల్లం} ఇలా బోధించారు: "ఫిత్రా {మానవుడి స్వాభావిక ఏకదైవ విశ్వాస} స్థితిలో కాకుండా ఏ బిడ్డా జన్మించడు. అయితే అతని తల్లిదండ్రులు అతడిని యూదుడిగానో, క్రైస్తవుడిగానో లేక అగ్నిపూజారిగానో చేసి వేస్తారు." {సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం.}


🔰 _'ఇస్లాం అంటే ఏమిటి ?', 'అల్లాహ్ {సృష్టికర్త} అంటే ఎవరు ?' అనే అంశాల గురించి వివరంగా తెలుసుకున్న తరువాత, 'భూమ్యాకాశాలను మరియు సమస్త విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడా ? లేక అవి వాటికవే ఉనికిలోనికి వచ్చాయా ?' అనే అంశం గురించి InSha Allah రేపటిభాగంలో తెలుసుకుందాం.


అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు

No comments:

Post a Comment